పవన్ వ్యాఖ్యలు: డైలమాలో బీజేపీ నేతలు, ప్యాకేజీ క్రెడిట్ ఎవరికి?
అమరావతి: ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల లాభం బీజేపీకా? లేక టీడీపీకా? అంతేకాదు కేంద్రం ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు దోహదపడుతుందా? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎగతాళి చేసిన మరుసటి రోజనే రాష్ట్ర బీజేపీ నేతలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయి ప్యాకేజీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడు భారీ బహరంగ సభలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అయితే బీజేపీ ఏర్పాటు చేయనున్న ఈ మూడు సభల్లో ప్యాకేజీపై ప్రజలకు ఎలా అర్ధమయ్యేలా చెప్పాలో తెలియక ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఏపీకి హోదానే కావాలంటూ ప్రజల నుంచి వస్తున్న నిరసలకు బాధపడాలో తెలియని విచిత్రమైన పరిస్థితిలో బీజేపీ నేతలు చిక్కుకున్నారు.
కేంద్రం ప్యాకేజీని ప్రజలు అంగీకరిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని బీజేపీ నేతలు చేసిన ప్రకటనతో ఆశగా ఎదురు చూసిన ఏపీ ప్రజలు అర్ధరాత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ చూసి నిట్టూర్చారు. జైట్లీ పేర్కొన్న ప్యాకేజీ అంతా విభజన చట్టంలోనే ఉంది కదా, కొత్తగా ఏమిచ్చారంటూ ప్రశ్నించిన వారు లేకపోలేదు.
అంతేకాదు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై స్పష్టత లేకపోవడం కూడా బీజేపీ నేతలను కలవరపెడుతోంది. ప్యాకేజీ ప్రకటనకు మూడు రోజుల ముందు విజయవాడలో బీజేపీ కార్యదర్శల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్పెషల్ ప్యాకేజీనా... స్పెషల్ స్టేటసా... ఏదో ఒకటి తేల్చాలని హైకమాండ్‌ను కార్యదర్శలు కోరారు.
చంద్రబాబు కూడా రాష్ర్టానికి ప్యాకేజీ లేదా హోదా ప్రకటించాలంటూ పదేపదే డిమాండ్ చేస్తున్నారని... ఇప్పుడు ప్రకటించినా ఆ క్రెడిట్ మనకు దక్కదని ... అందువల్ల బీజేపీ బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాక ప్యాకేజీ ప్రకటిస్తే బాగుంటుందని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్‌సింగ్‌లు అలాగే చేద్దామని చెప్పి వారు ఢిల్లీ వెళ్లే లోపు ప్యాకేజీని ప్రకటించారు.

జైట్లీ అర్ధరాత్రి ప్యాకేజీ ప్రకటన అనంతరం రాష్ట్రంలో హోదాపై నిరసనలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇవన్నీ జరిగిన తర్వాత బీజేపీ నేతలు తాపీగా ఢిల్లీ బయల్దేదారు. అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడులకు శాలువాలు కప్పి సత్కరించడంతో పాటు.. ప్రకటించిన ప్యాకేజీకి కృతజ్ఞతలు తెలిపారు.
అసలే ఆగ్రహంగా ఉన్న ఏపీ ప్రజలకు ఈ పరిణామాలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, అమిత్‌షాలు ఆంధ్రా బీజేపీ నేతలకు ఒక రకంగా క్లాస్ తీసుకున్నారు. హోదా కంటే ప్యాకేజీ ద్వారా ఏపీకి ఎక్కువ మేలు జరుగుతుందని జైట్లీ చెబుతూ ఆచరణలో అది ఎలాగో చూపిస్తామని వివరించారు.
అంతేకాదు హోదాకి, ప్యాకేజీకి మధ్య ఉన్న తేడాను ఏపీలో సభలు పెట్టి ప్రజలకు చెబుదామని జైట్లీ రాష్ట్ర బీజేపీ నేతలకు మనోధైర్యం కల్పించారు. ఇందులో భాగంగానే ఏపీలో మూడు భారీ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేస్తోంది. హోదాతో పోలిస్తే ప్యాకేజీ విషయంలో చంద్రబాబు కూడా కాస్తంత మెత్తబడ్డారు.
కేంద్రం ఇచ్చిన దాన్ని తీసుకుని ఆపై హోదా కోసం గట్టిగా పట్టుబట్టాలనే చంద్రబాబు అంటున్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని వద్దంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పయనింపజేస్తూ మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచన దిశగా ఆయన ఉన్నారు.
అంతేకాదు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని గానీ నిధులను గానీ రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు రాష్ట్ర బీజేపీ నేతలు వినియోగించుకోవడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. జనసేన అధినేత పవన్ సైతం హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పూర్తిగా చంపేశారని ఈ పరిస్థితో రాష్ట్ర బీజేపీ నేతలు వేరే పార్టీని చూసుకోవాలని కాకినాడ సభలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications