మళ్లీ హోదాను కెలికిన బీజేపీ-ఈసారి ఎవరిని ముంచబోతోంది ? 2019 సీన్ రిపీట్ అవుతుందా!
ఏపీ విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన కీలకహామీ ప్రత్యేక హోదా. ఈ హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇంకా అమలు కాలేదు. అయితే దీని పేరు మీద రాజకీయ పార్టీలు తమ రాజకీయ పబ్బం మాత్రం గడుపుకుంటున్నాయి. ఇదే కోవలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్రంలో పోరు మొదలుపెట్టిన వైసీపీ.. తమకు అధికారమిస్తే హోదా తెస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అది సాకారం కాలేదు. అదే సమయంలో బీజేపీ హోదా వ్యవహారాన్ని మళ్లీ కెలికింది.

ప్రత్యేక హోదాను కెలికిన బీజేపీ
ఏపీకి బకాయిపడిన ప్రత్యేక హోదాను ఇచ్చే విషయంలో ఎనిమిదేళ్లుగా తాత్సారం చేస్తూ వస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. తాజాగా దాన్ని మరోసారి కెలికింది. ఈ నెల 17న హోంశాఖ నిర్వహించే తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కార భేటీ అజెండాలో దాన్ని చేర్చింది. అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. అంతే గంటల వ్యవధిలోనే దాని అజెండాలోని హోదాను తొలగిస్తూ మరో అజెండా విడుదల చేసింది. దీంతో హోదాపై చర్చకు అంగీకరించినట్లే అంగీకరించి వెనక్కి తగ్గినట్లయింది.

తమ వల్లేనన్న వైసీపీ
కేంద్రం విభజన సమస్యలపై చర్చించేందుకు భేటీ అజెండా ప్రకటించగానే అది తమ ఘనతేనంటూ వైసీపీ జబ్బలు చరుచుకోవడం మొదలుపెట్టింది. జగన్ పదే పదే ప్రస్తావించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకుంది. చంద్రబాబు పడేసిన ప్రత్యేక హోదాను తాము నిలబెట్టామని వైసీపీ నేతలు రోజంతా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకున్నారు. చివరికి కేంద్రం సాయంత్రానికి షాకిచ్చింది. దీంతో వైసీపీ కూడా నీరుగారిపోయింది. కేంద్రం నిర్ణయంతో వచ్చే ఎన్నికల కల్లా తమకు హోదా వ్యవహారం కలిసొస్తుందని భావించిన వైసీపీకి ఇప్పుడు ఈ యూటర్న్ మింగుడుపడటం లేదు.

పూర్తి గందరగోళంలో టీడీపీ
ప్రత్యేక హోదా అంశం కేంద్రం నిర్వహించే సమావేశం అజెండాలో చేరిందని తెలిసిన తర్వాత టీడీపీకి ఎలా స్పందించాలో తెలియలేదు. దీనిపై ఓవైపు వైసీపీ సెటైర్లు వేస్తున్నా దానిపై స్పందించలేదు. ఈ విషయంలో వైసీపీని ఎలా కౌంటర్ చేయాలన్న వ్యూహం లేకపోవడంతో టీడీపీ పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ప్రత్యేక హోదాపై తాము చేయలేని పని వైసీపీ చేసి చూపిస్తున్న సంకేతాలు రావడంతో దీన్ని సమర్ధించుకోవడానికి మల్లగుల్లాలు పడింది. అదే సమయంలో కేంద్రం నుంచి వెలువడిన ప్రకటనతో టీడీపీ ఊపిరిపీల్చుకుంది.

2019 రిపీట్ అవుతుందా?
ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమైందంటూ గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన అప్పటి విపక్ష వైసీపీ రాజకీయంగా భారీ లబ్ది పొందింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంతో టీడీపీ ఎందుకు కలిసుందంటూ వైసీపీ మొదలుపెట్టిన పోరు.. చివరికి ఆ పార్టీ కొంపముంచింది. చివరికి కేంద్రం నుంచి తప్పుకున్న టీడీపీ, అనంతరం ఎన్డీయ నుంచి కూడా తప్పుకోవడమే కాకుండా బీజేపీపై ధర్మపోరాటం పేరుతో పోరు ప్రారంభించి దారుణంగా భంగపడింది.
ఆ అనుభవంతో వైసీపీ ఇప్పుడు అలాంటి తప్పిదం చేసేందుకు సిద్ధంగా లేదు. కానీ టీడీపీ కూడా అప్పటి వైసీపీ స్ధాయిలో పోరు సలపడం లేదు. దానికి ప్రధాన కారణం టీడీపీ గత తప్పిదాలే. దీంతో 2019 నాటి సీన్ రిపీట్ అవుతుందా లేదా అనే దానిపై కూడా రాష్ట్రంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications