జేసీ బ్రదర్స్ పై బీజేపీ గురి..!?
ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులకు మంచి పేరుంది. రాజకీయంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచరులున్నారు. వీరిద్దరూ వారు పోటీచేసే నియోజకవర్గాలు కాకుండా మరో నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరు. సరిగ్గా ఇలాంటివారినే భారతీయ జనతాపార్టీ లక్ష్యంగా ఎంచుకుంది. గత ఎన్నికల్లో వారి వారసులు తెలుగుదేశం తరఫున అనంతపురం ఎంపీ స్థానానికి, తాడిపత్రి శాసనసభకు బరిలో దిగి ఓటమిపాలయ్యారు.

ఈడీ విచారణకు హాజరైన జేసీ
పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో వారసులు కాకుండా జేసీ సోదరులిద్దరినీ బరిలోకి దిగమని కోరుతున్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కానీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటువంటి తరుణంలోనే ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ మినహా ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలపైనా ఈడీ దాడులు చేసిందంటే కచ్చితంగా కేంద్రం హస్తముందనే వాదన బలపడింది.

స్క్రాప్ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు
దివాకర్ ట్రావెల్స్ యజమాని, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ప్రభాకర్ రెడ్డి వరుసగా రెండురోజులపాటు హైదరాబాద్‌లోని ఈడీ విచారణకు హాజరయ్యారు. మొదటిరోజు సుమారు 8 గంటలకు పైగా అధికారులు ప్రశ్నలు సంధించారు. అశోక్ లేల్యాండ్ కంపెనీ నుంచి 126 బస్సుల స్క్రాప్ కొనుగోలు వ్యవహారంలో ప్రభాకర్ రెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేది ఈడీ అభియోగం. ఇందులో వాస్తవమెంతనేది జేసీ సోదరులకు, ఈడీ అధికారులకే తెలియాలి. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ స్క్రాప్ కొనుగోలులో మనీ ల్యాండరింగ్ కు పాల్పడలేదని చెప్పినట్లు తెలిపారు.

ఆరోపణల వెనక బీజేపీ రాజకీయ కోణం?
స్క్రాప్ కొనుగోలు సందర్భంగా జేసీ పెట్టిన సంతకాలు ఫోర్జరీ అయ్యాయనిదానిపై ఈడీ రంగంలోకి దిగాల్సిన అవసరం లేదు. ఈడీ జరిపిన విచారణ మొత్తం మనీ ల్యాండరింగ్ పై అని స్పష్టమైంది. జేసీ సోదరులపై ఎప్పటినుంచో ఆరోపణలున్నా ed ఇప్పుడే రంగంలోకి దిగడానికి బలమైన రాజకీయ కారణం ఉండివుంటుందని భావిస్తున్నారు.
ఈడీ ద్వారా జేసీ సోదరులపై ఒత్తిడి తెచ్చి లొంగదీసుకోవడమే భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనపడుతోందంటున్నారు. జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుందికానీ వారు ఇంతవరకు అడుగు ముందుకు వేయలేదు. మరోవైపు కేసీఆర్ తన బీఆర్ ఎస్ లోకి ఆహ్వానించారంటూ వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నవారిలో వీరు కూడా ఉన్నారంటున్నారు. ఏదేమైనప్పటికీ వీటిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు మరి.












Click it and Unblock the Notifications