నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ తీపి కబురు
గత రెండేళ్లుగా రుతుపవనాలు నిరాశపరచలేదు. 2024, 2025లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జలాశయాలు నిండాయి. నిండుకుండల్లా తొణికిసలాడాయి. ఈ ఏడాది ఈ జలకళకు తెరపడే ప్రమాదం పొంచివుందని అంచనాలు కొొంతకాలంగా వెలువడుతున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవచ్చని పేర్కొంది. దీంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాల మధ్య తాజాగా ఐఎండీ తీపి కబురు వినిపించింది. తాజా అంచనాల మేరకు నైరుతి రుతుపవనాలు ఈ నెల 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. రుతుపవనాలు మరింత విస్తరించడానికి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేసింది కూడా. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని భాగాలకు ఈ నెల 4వ తేదీ నాటికి రుతు పవనాలు చేరుకుంటాయని పేర్కొంది.

ఇవి మరింత విస్తరించడంలో భాగంగా నైరుతి- పశ్చిమ మధ్య, తూర్పు మధ్య- ఈశాన్య బంగాళాఖాతంలోని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు జూన్ 4 నాటికి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. ఇది ఊరట ఇచ్చినట్టయింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు మే మూడవ వారంలో అండమాన్ నికోబార్ దీవులను చేరుకుంటాయి.
ఆ తర్వాత అవి భారత భూభాగంపైకి ప్రయాణిస్తాయి. జూన్ 1వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళలో రుతుపవనాల ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం రుతుపవనాల రాకలో జాప్యం చోటు చేసుకుంది. 2వ తేదీకి కూడా వాటి జాడ లేదు. తాజాగా ఐఎండీ వెలువడించిన అంచనాలు ఊపిరిపోశాయి. జూన్ 4వ తేదీ నాటికి నైరుతి.. కేరళ తీరాన్ని తాకుతుందని, ఆ వెంటనే చురుగ్గా విస్తరిస్తుందని పేర్కొంది. దీని విస్తరణకు సంబంధించిన వివరాలు 6వ తేదీ నాటికి ఖరారు కావొచ్చు.
ఈ ఏడాది 90 శాతం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని ఐఎండీ ఇదివరకు అంచనా వేసిన విషయం తెలిసిందే. దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో దాదాపు 75 నుంచి 80 శాతం నైరుతి రుతుపవనాల కాలంలోనే రికార్డవుతుంది. నాలుగు నెలల ఈ రుతుపవన కాలం వ్యవసాయ రంగానికి, దేశ విస్తృత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ముఖ్యంగా వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి కీలకమైన ఖరీఫ్ పంటల సాగుకు ఈ వర్షాలు అనివార్యం.












Click it and Unblock the Notifications