ఏపీలో హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై చంద్రబాబు సర్కార్ కీలకనిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహార భద్రతను బలోపేతం చేయడానికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార కల్తీని అరికట్టడం మరియు తాగునీటి కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా సమగ్ర వ్యూహాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం మానవ జీవన విధానం మారడంతో చాలా మంది బయట ఆహారం కొనుగోలు చేసి తినడం సాధారణం అయింది.
ఆహార పదార్థాల్లో కల్తీతో ఆరోగ్యానికి హాని.. లైన్ శాఖల ఉమ్మడి కార్యాచరణ
దీన్ని అవకాశంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీ చేసి, ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆహార భద్రతా శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్, ఉద్యానవనాలు, పశువైద్యం వంటి శాఖలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి కమిటీలు సమావేశమై సమీక్షించాలి.

ఫుడ్ సేఫ్టీ కోసం చెయ్యాల్సింది ఇదే
పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం, తాగునీరు వంటి హై-రిస్క్ ఉత్పత్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలి.'ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్' సంచార వాహనాల ద్వారా మార్కెట్లు, సంతల్లో ఆన్‌స్పాట్ పరీక్షలు నిర్వహించాలి.హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ సంస్థలకు పరిశుభ్రత ఆధారంగా రేటింగ్ వ్యవస్థ అమలు చెయ్యాలి. లైసెన్స్ ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి.
ఆ పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం చంద్రబాబు
ఆహారభద్రతా ప్రయోగశాలల్లో 69శాతం పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో 150పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇందువల్ల పరీక్షలు వేగంగా జరుగుతాయి. అంతేకాకుండా, కలుషితం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ప్రత్యేక పర్యవేక్షణ ఉంచనున్నారు. ప్రతి తనిఖీ, నమూనా సేకరణ, సీజ్ చేసిన వస్తువులు, కోర్టు కేసుల వివరాలన్నీ 'ఫోస్కోస్' యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇది పారదర్శకతను పెంచి, అధికారుల బాధ్యతలను మరింత పెంచుతుంది.
ఆహార భద్రతలో ముందున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ
ఈ చర్యల ద్వారా ప్రజలు సురక్షితమైన ఆహారం మరియు నీటిని వినియోగించే వాతావరణం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆహార కల్తీపై ప్రభుత్వం చేపట్టిన ఈ కఠిన చర్యలు రాష్ట్రంలో ఆరోగ్య సమస్యలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఇది వ్యాపారులకు కూడా హెచ్చరికగా మారి, నాణ్యమైన ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఈ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసి, ఆంధ్రప్రదేశ్‌ను ఆహార భద్రతలో ముందున్న రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.













Click it and Unblock the Notifications