మోడీకి బాబు ఫోన్: బిజెపి, టిడిపి పొత్తు ఖరారు
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపి మధ్య రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్లు తెలిసింది. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అదే సమయంలో తెలుగుదేశం నాయకులు, తెలంగాణ బిజెపి నాయకులు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలతో చర్చలు జరిపారు.
సీట్ల పంపిణీ విషయమై రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది. ఉగాది రోజున సోమవారం రెండు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. పొత్తుల విషయమై ఈ సాయంత్రం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

ఢిల్లీలో సోమవారం సాయంత్రం బిజెపి ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. పొత్తుల వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో తెలుగుదేశం నేతలు సుజనా చౌదరి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
పొత్తుకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నట్లు తెలుగుదేశం నాయకులు ఆ పార్టీ జాతీయ నేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరితేనే ప్రయోజనం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి నేతలకు వివరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications