పొత్తులో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఖరారు - ఎవరెక్కడ..!!
ఏపీలో పొత్తుల సర్దబాబు తుది దశకు చేరింది. ఢిల్లీ కేంద్రంగా పొత్తుల పైన కసరత్తు జరుగుతోంది. ఎంపీ సీట్ల పైనే బీజేపీ - టీడీపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఖాయమని చెబుతున్నా.. సీట్ల పైన తుది నిర్ణయం జరిగిన తరువాతనే అధికారికంగా ప్రకటన రానుంది. ఈ సమయంలోనే బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే సీట్ల పైన నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీకి 12-14 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం.
పొత్తులు లెక్కలు : బీజేపీ - టీడీపీ మధ్య సీట్ల గురించి ప్రస్తుతం ఢిల్లీ వేదికగా చర్చలు సాగుతున్నాయి. బీజేపీ 10 ఎంపీ సీట్లు కోరుతోంది. చంద్రబాబు ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇవ్వటంతో..బీజేపీకి 6 వరకు వచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే, బీజేపీ నుంచి 10 సీట్ల కోసం ఒత్తిడి చేస్తోంది. ఈ సమయంలో టీడీపీ 8 ఎంపీ సీట్లకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సీటు కోసం బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. చంద్రబాబు అందుకు అంగీకరించటం లేదు. విశాఖ మాత్రం బీజేపీకి ఇచ్చేందుకు దాదాపు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇక, ఎమ్మెల్యే స్థానాల పైన చర్చ సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే స్థానాల విషయంలో కొంత పట్టు విడుపు ధోరణితో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి కేటాయించే స్థానాలు : ఎంపీ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ కోరిన నియోజకవర్గాల పైన పట్టుబడుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 13 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. ఈ సారి ఆ స్థానాలతో పాటుగా మరో రెండు నియోజకవర్గాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్దమైనట్లు చెబుతున్నారు. అందులో భాగంగా..శ్రీ కాళహస్తి , జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, తాడేపల్లి గూడెం, గుంటూరు పశ్చిమం లేదా విజయవాడ సెంట్రల్ స్థానాలు ఇప్పటి వరకు ఖరారైనట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కైకలూరు, విశాఖ నార్త్, రాజమండ్రి, తాడేపల్లి గూడెం స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే రాజమండ్రి సీటును టీడీపీ తమ అభ్యర్దిని ఖరారు చేసింది. తాడేపల్లి గూడెం జనసేన కోరుకుంటోంది.

అసెంబ్లీ నియోజకవర్గాలు : ఇక, విశాఖ నార్త్ నుంచి తిరిగి మరోసారి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారు. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ధర్మవరం నుంచి వరదాపురం సూర్యనారాయణ పోటీలో నిలవనున్నారు. అనంతపురం అర్బన్ సీటును తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. దీంతో..ఎంపీ స్థానాల పైన ప్రస్తుతం బీజేపీ ముఖ్యులతో జరుగుతన్న చర్చల్లో ఒక నిర్ణయానికి రానున్నారు. ఆ తరువాత అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానాల పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బీజేపీకి 9 స్థానాలు టీడీపీ ప్రతిపాదిస్తున్నా.. 10-12 స్థానాల వరకు ఇచ్చేందుకు నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. దీంతో, వీటి పైన అధికారిక ప్రకటన పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications