ఏపీని ఆఫ్ఘనిస్థాన్ గా మార్చి వైసీపీ తాలిబన్ల పాలన: దమ్ముంటే రండి తేల్చుకుందామన్న బీజేపీ విష్ణువర్ధన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఆత్మకూరు ఘటనను బిజెపి నేతలు వదిలిపెట్టడం లేదు. ఆత్మకూరులో ఇళ్ల మధ్యలో మసీదు నిర్మాణం చెయ్యడానికి ప్రయత్నించిన వారిని ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసి, ఆపై ఆయన పైన తప్పుడు కేసులు బనాయించిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ బీజేపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు .

వైసీపీ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగిన బీజేపీ విష్ణువర్ధన్
తాజాగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వైసిపి ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చారని మండిపడ్డారు. ఆంధ్రాలో తాలిబన్ల పాలన సాగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. వైసిపి ఉగ్రవాద పార్టీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం రూపంలో పరిపాలన సాగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య ఘటన కాదు, వైసీపీ, బీజేపీ మధ్య ఘటన
ఆత్మకూరులో చోటు చేసుకున్న ఘటన రెండు వర్గాల మధ్య జరిగిన ఘటన కాదని, వైసీపీ బీజేపీ మధ్య చోటు చేసుకున్న సంఘటన అని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు . వైసిపి నేతలను కేసు నుంచి తప్పించడం కోసం మతఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలను ఇరికించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయ సూచనలతోనే ఆత్మకూరులో దాడులు చేశారని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరుకు వెళ్లకుండా టిడిపి నేతలను అడ్డుకున్న వాళ్లు డిప్యూటీ సీఎంను ఆత్మకూరుకు ఎందుకు పంపించారు అంటూ ప్రశ్నించారు.

బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే బీజేపీ ఛలో ఆత్మకూరు
సీఎం జగన్ కు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మకూరు ఘటనలో బిజెపి ఎటువంటి కుట్రలు చేయలేదని, ఘటనకు బాధ్యులైన వైసిపి నేతలపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త బీజేపీ శ్రేణులు చలో ఆత్మకూరు పేరుతో ఆత్మకూరుకు వస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇదే తొలిసారి ఇదే చివరి సారి కూడా అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Recommended Video

దమ్ముంటే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మకూరు రండి తేల్చుకుందాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా దమ్ముంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఆత్మకూరు రావాలని అక్కడ తేల్చుకుందాం అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసిపి పులులు ఢిల్లీలో పిల్లులు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐపీసీని వైసిపిగా మార్చేశారా అని మండిపడ్డారు. ఆత్మకూరు ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో తాలిబన్ మూకలు రాజ్యమేలుతున్నాయి అని, వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చుట్టాలుగా మారాయని విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications