Daggubati Purandeswari : దగ్గుబాటి పురంధేశ్వరి నియామకం వెనుక అసలు కారణమిదే ?
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తూ అధిష్టానం ఇవాళ నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీనియర్ రాజకీయ నాయకురాలు కావడం, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, రాష్ట్రంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అన్నింటినీ మించి ఎన్టీఆర్ కుమార్తె కావడం ఆమెకు ప్లస్ అయ్యాయి. పురంధేశ్వరితో పోలిస్తే ఆమెతో ఈ రేసులో నిలిచిన సత్యకుమార్, సుజనా చౌదరి వంటి వారు ఆయా అంశాల్లో ఆమెతో పోటీ పడే పరిస్ధితి లేదు.
దగ్గుబాటి పురంధేశ్వరి అనగానే గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ కుమార్తె అనే. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచిన పురంధేశ్వరి రాజకీయ సమీకరణాల్లో భాగంగా యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కించుకున్నా.. ఆ తర్వాత మాత్రం పనితీరు కారణంగానే పేరు తెచ్చుకున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతకాలంగా ఆమె ఎన్టీఆర్ కుమార్తె అనే విషయాన్నే దాదాపు అంతా మర్చిపోయారు. పురంధేశ్వరి సమర్ధత, రాజకీయ అనుభవం, కేంద్రమంత్రిగా పనిచేసినప్పుడు వ్యవహారశైలే ఇందుకు కారణం.

అలాగే యూపీఏను వీడి బీజేపీలో చేరిన తర్వాత కూడా పురంధేశ్వరి తనదైన ముద్ర వేయగలిగారు. ముఖ్యంగా జాతీయ స్ధాయి పదవిలో నియామకం తర్వాత అగ్రనేతలతో కలివిడిగా ఉండటం, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడం, ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపికి ఉపయోగపడే స్ధాయిలో ఉండటం పురంధేశ్వరికి ప్లస్ అయ్యాయి. అయితే వీటన్నింటికంటే మించిన మరో కీలక కారణం ఆమెను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యేందుకు పనికొచ్చింది.

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్నాయి. మధ్యలో జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్నా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కారణంగా ఇరు పార్టీల మధ్య పొత్తున్నా లేనట్లుగానే పరిస్దితి తయారైంది. ఇలాంటి సమయంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా తన ప్రయారిటీ ఏంటో బీజేపీ చెప్పేసింది. ఇప్పటికే టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు పురంధేశ్వరి, చంద్రబాబు కాంబినేషన్ తో జనాల్లోకి వెళ్లడం ద్వారా అధికారం కొల్లగొట్టాలన్న టార్గెట్ పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications