తెరాసలోకి ఎమ్మెల్యేలు: ఫలించని బాబు ప్రయత్నాలు

తెలంగాణ ఏర్పడకుండా చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారని కాంగ్రెసు, టిడిపిలు ఆరోపిస్తున్నాయి. టిని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారనే ప్రచారం నేపథ్యంలో పార్టీకి తెలంగాణలో భవిష్యత్ ఉండదన్న అంచనాతో ఈ ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా తెరాసలోకి జంప్ అవుతున్నారని అంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవల తెరాసలో చేరగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరనున్నట్టు ఆదివారం ప్రకటించారు.
వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే జి నగేశ్ ఇద్దరూ సోమవారం తెరాస అధినేత కెసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో తెరాస తీర్థం పుచ్చుకున్న తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకోనుంది. రెండేళ్ల కిందట నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదే జిల్లా కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరి, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస నుంచి గెలుపొందారు.
ఏడాది కిందట రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే వేణుగోపాలా చారి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే తెరాసలో చేరగా, రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత రంగారెడ్డి జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే రత్నం, అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తెరాసలో చేరారు.
పార్టీ నుంచి తెరాసలోకి జరగుతున్న వలసలను ఆపడానికి తెలంగాణ టిడిపి నేతలతో అధినేత చంద్రబాబు సమావేశమై నష్టనివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, వలసల పరంపర కొనసాగుతుండటంతో టిటిడిపి దుకాణం ఖాళీ అవుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాకుండా ఇదే ప్రాంతానికి చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరడానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే తెరాసలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరిన తర్వాత ఇక తమ పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లేవారు ఎవరూ లేరని టిటిడిపి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించిన రెండురోజులకే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తెదేపా గోడ దూకారు. పైగా ఆయన సొంత జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్ టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పైగా, ఎర్రబెల్లి తెరాసలోకి రానున్నారని ఇటీవల మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications