పవన్‌పై ఎమ్మెల్యే బొండా అభిమానం: బెజవాడలో ప్లెక్లీలు, రాజకీయంగా పెద్ద చర్చ
అమరావతి: విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కలకలం సృష్టించారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
పవన్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఈ ప్లెక్సీల్లో టీడీపీ సింబల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకుండా ఉండటమే. పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు బొండా ఉమా ఫోటోలతో మాత్రమే ఈ ప్లెక్సీలు నగరంలో ఏర్పాటు చేయడంతో తెలుగు తమ్ముళ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు.

టీడీపీ అధినేత, పార్టీ గుర్తు లేకుండా పవన్‌తో తనొక్కడి ఫోటోలు మాత్రమే వేయించుకోవడం ఏంటని బొండా వ్యవహారంపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల తిరుపతిలో పవన్ ఏర్పాటు చేసిన సభలో ఏపీకి హోదా సాధించేందుకు టీడీపీ ఎంపీలు ఏమాత్రం చిత్తశుధ్ధి ప్రదర్శించడం లేదని విమర్శించిన సంగతి తెలిసిందే.
టీడీపీ ఎంపీలు హిందీ నేర్చుకుని హోదా కోసం పోరాడాలని పవన్ అనడంతో పవన్‌పై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అయితే పవన్‌పై కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు.
పవన్ ఏపీలో మాట్లాడాడు కాబట్టి సరిపోయిందని, ఇదే వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించి లోపల వేయించేవారని అన్నారు. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీజీపై బొండా ఉమా అదే స్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో తాను ఉండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని ఆయన టీడీపీలో చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బీజేపీ, టీడీపీ ఎంపీలపై పవన్ వ్యాఖ్యల వ్యవహారంలో బొండా ఉమా పవన్ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే బొండా ప్లెక్సీలు పెట్టించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, బొండా ఉమా రాజకీయాల్లోకి రాకముందు నుంచే పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అనే టాక్ విజయవాడలో ఉంది. అంతేకాదు బొండా ఉమా పవన్ కళ్యాణ్‌కు చెందిన సమాజికి వర్గానికి చెందిన నేత కావడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ విజయవాడకు వచ్చిన సమయంలో బొండా ఉమా ప్రత్యేకంగా కలిశారు.












Click it and Unblock the Notifications