Borugadda Anil:30 కేజీలు తగ్గిపోయా-ఎందాకైనా వెళ్తానన్న బోరుగడ్డ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు, వీడియోలతో రెచ్చిపోయిన ఆ పార్టీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం కోర్టుకు హాజరైన సందర్భంగా బోరుగడ్డ అనిల్ మధ్యలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తన బెయిల్ వ్యవహారంపై జరుగుతున్న రచ్చపై ఆయన తీవ్రంగా స్పందించారు. దీనిపై ఎందాకైనా వెళ్తానంటూ హెచ్చరికలు చేశారు.
2018లో అనంతపురంలోని రామచంద్రనగర్‌లోని చర్చ్ స్థలం వివాదంలో సీఐ మురళీకృష్ణను బెదిరించాడంటూ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు చర్చ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై తన వర్గానికి సహకరించాలంటూ అప్పటి త్రీటౌన్ సీఐ మురళీ కృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఐ మురళీ కృష్ణ సహకరించడం లేదంటూ ఆయనకు ఫోన్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడినట్లు బోరుగడ్డ అనిల్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇవాళ అనంతపురం కోర్టుకు పీటీ వారెంట్ పై ఆయన్ను తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ మాట్లాడుతూ...బెయిల్ కోసం తాను ఎలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు. తనకు డాక్టర్ రాఘవ శర్మ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇచ్చారని, దీనిపై కోర్టుకు వెళ్లి నిరూపించుకుంటానన్నారు. అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీయిస్తామన్నారు. అలాగే గూగుల్ టేక్ అవుట్ డేటా కూడా బయటకు తెస్తానన్నారు. ఈ వ్యవహారంలో ఎంత దూరమైనా వెళ్తామని బోరుగడ్డ అనిల్ వెల్లడించారు. మరోవైపు తాను ఈ కేసుల కారణంగా 30 కేజీల వరకు బరువు తగ్గిపోయినట్లు బోరుగడ్డ తెలిపారు. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు.
తన తల్లికి అనారోగ్యం పేరుతో ఓసారి బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్.. ఆ తర్వాత బెయిల్ పొడిిగింపు కోసం ఫేక్ సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనిల్ కు తాను సర్ఠిపికెట్ ఇవ్వలేదని సదరు డాక్టర్ చెప్తుంటే.. ఆస్పత్రి ఇచ్చిందని ఆయన అంటున్నాడు. దీంతో ఈ వ్యవహారంలో అనిల్ బయటపడాలంటే పోలీసులు వాస్తవ ఆధారాలు సమర్పించాల్సి ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications