మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్- పునఃసమీక్ష?
Botcha Satyanarayana: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది- మూడు రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది గానీ అది సాధ్యపడలేదు. వాస్తవ రూపాన్ని దాల్చలేదు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి- మూడు రాజధానుల విధానం కూడా ఓ కారణమంటూ అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిందా పార్టీ. సీనియర్లు సైతం పరాజయాన్ని చవిచూశారు.

ఈ ఓటమి నేపథ్యంలో మూడు రాజధానుల విధానాన్ని వైఎస్ఆర్సీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై తాజాగా మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇదే విధానాన్ని కొనసాగించడంపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల విధానాన్ని తాము అనుసరించామని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై తమ విధానం ఏమిటనేది ఇప్పటికప్పుడు చెప్పలేమని, పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పార్టీలో డిస్కస్ చేసి చెబుతామని వివరించారు.
విశాఖపట్నం రుషికొండలో జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పర్యాటక భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆరోపించడాన్ని బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు.
అవినీతి జరిగితే బిల్లులు ఎందుకు చెల్లించారంటూ ప్రశ్నించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారంటూ మండలిలో ప్రశ్నించితే- రుషికొండతో ముడిపెడుతున్నారని విమర్శించారు. ఆ భవనాల నిర్మాణంలో నిజంగా అవినీతి జరిగితే విచారణ జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications