జల జగడం: టీఆర్ఎస్-వైసీపీ కలిసి చేస్తున్న నాటకం-హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే-బీజేపీ నేత విష్ణువర్ధన్
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న నీటి పంచాయితీ రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ పెంచుతోంది. కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు అక్రమమని తెలంగాణ వాదిస్తుండగా... తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులే అక్రమమని ఏపీ ఆరోపిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్,పోతిరెడ్డిపాడు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అసలు ఏపీలో కొత్త ప్రాజెక్టులేవీ లేవని ఏపీ చెబుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులు,నేతలు ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఈ వివాదంపై స్పందించారు.
ఏపీ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు అనవసర వివాదాన్ని సృష్టిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అనుమతులు లేకుండానే ఎన్నో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని... వాటి సంగతేంటని ప్రశ్నించారు. అటు తెలంగాణ ప్రభుత్వం,ఇటు ఏపీ ప్రభుత్వం అనవసరంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక ఉండటంతో... దానికోసమే ఈ నాటకానికి తెరలేపారని విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాల అధికార పార్టీలు ఈ నాటకంలో భాగస్వాములయ్యాయని అన్నారు. ఈ నెల 28న ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ తరుపున ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తుందన్నారు.

తెలంగాణ-ఏపీ వేరుపడ్డప్పటినుంచి ఈ జల వివాదం కొనసాగుతూనే ఉంది. నిజానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జల వివాదాల పరిష్కారానికి చొరవ చూపారు. సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌కు ఆహ్వానించి వివాదాలపై చర్చించారు. బేసిన్లు లేవు... భేషజాలు లేవు... ఏ వివాదమైనా సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఆ సందర్భంగా ప్రకటించారు. అయితే ఇదంతా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వారు కాపాడుకునే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ తప్పట్లేదు.
నిజానికి కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన ఏడాది లోపే ఇరువురి మధ్య నీటి వివాదాలను పరిష్కరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ వివాదాన్ని కేంద్రం పరిష్కరించలేకపోయిందని ఇరువురు ఆరోపిస్తున్నారు.కృష్ణా,గోదావరి జలాల్లో మిగులు జలాల వాటాను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications