ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు: వెంకయ్యపై బొత్స, ‘బాబు సంతకానికి విలువ లేదా?’
విశాఖపట్నం: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
లేదంటే ఏప్రిల్ 14వ తేదీన విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిచేదని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి సంస్థ ప్రస్తుతం రైతులకు రూ. 75 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెల 30వ తేదీలోగా రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

బాబు సంతకాలకు విలువ లేకుండా పోయింది
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబునాయుడు ఆయన ఐదు సంతకాలు చేశారని, వాటికి ఇప్పుడు విలువ లేకుండా పోయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల వేళ చెప్పారని గుర్తు చేశారు.
డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయకపోగా.. రుణాలు వసూలు చేయాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారని ఆరోపించారు. రుణాలు వసూలు చేస్తేనే జీతాలు పెంచుతామని బెదరిస్తున్నారని ఈశ్వరి విమర్శించారు.












Click it and Unblock the Notifications