రాజధాని పేరుతో భారీ స్కాం: బొత్స, 'ఈనాడు' ఎఫెక్ట్, బాబుపై లేచిన జగన్ పార్టీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు మండిపడ్డారు. ప్రజా రాజధాని ముసుగులో కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది ప్రభుత్వమా లేక ప్రయివేటు వ్యాపార సంస్థనా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న సీమాంధ్రగా కనిపించడం లేదని, స్కామాంధ్రగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని పేరుతో భారీ మోసం, కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన సింగపూర్ కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారని నిలదీశారు. సింగపూర్ కంపెనీలకు భూములు ఇవ్వడాన్ని తాము ఆనాడే వ్యతిరేకించామని చెప్పారు.

ఈ ప్రభుత్వం పంచభూతాలను కబ్జా చేస్తోందన్నారు. మట్టి, నీరు, ఇసుక తర్వాత ఇప్పుడు భూముల కుంభకోణానికి తెరలేపిందన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు ఏపీకి నష్టదాయకమని చెప్పారు. దీనిని వైసిపి మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు.
నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రకు ముఖ్యమంత్రా లేక స్కాములకు ముఖ్యమంత్రా అని బొత్స తీవ్రంగా ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఖనిజ సంపదను పూర్తిగా దోచుకుంటోందన్నారు. ఇసుక ఆదాయ వనరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోర్ కేపిటల్ నిర్మాణంలో మాస్టర్ డెవలపర్‌గా ఉండేందుకు సింగపూర్ కంపెనీలు ఏపీ ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరాయని, మూలధనంగా కేవలం రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టి, కోర్ కేపిటల్ ప్రాంతంలోని నాలుగు వేల ఎకరాలపైనా జనరల్ పవరాఫ్ అటార్నీ కావాలని ప్రతిపాదించాయని, అందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించిందని ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడులో కథనం వచ్చింది. ఈ సందర్భంగా వైసిపి స్పందించడం గమనార్హం.












Click it and Unblock the Notifications