మీడియాపై బొత్స గుర్రు: బాబుపై 'అగ్రి' ఆరోపణ
హైదరాబాద్: మీడియా వార్తల పట్ల ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెసు నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఊహాజనితమైన వార్తలు రాసి మనోభావాలను దెబ్బ తీయవద్దని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు. బొత్స సత్యనారాయణ పార్టీ మారుతారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ సలహా ఇచ్చారు.
కాగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ కుంభకోణంతో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన అనుచరులకు సంబంధాలున్నాయని బొత్స ఆరోపించారు. అందుకే అగ్రి గోల్డ్ కుంభకోణంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తన పబ్బం గడుపుకోవడానికి, తన ఆలోచనల కోసం బేషజాలకు పోవడం మంచిది కాదని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసి కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని ఆయన అడిగారు. ఆయన ఎపికి చేసిందేమిటని అడిగారు. తన వాక్చాతుర్యంతో ప్రజల చెవిలో క్యాబేజీ పువ్వు పెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు వస్తే ప్రజలే నిలదీస్తారని, ఎపికి వెంకయ్య నాయుడిని రానివ్వరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications