కర్నూలులో ఘోరం: బాలుడి కాళ్లు, చేతులు విరిచి భిక్షమెత్తించాడు, మృతి
అమరావతి: పలకాబలపం పట్టి బడికెళ్లాల్సిన బాల్యాన్ని వీధుల పాలు చేశాడో దుర్మార్గుడు. చిట్టి చేతులతో బిక్షం ఎత్తించాడు. అన్నీ సవ్యంగా ఉంటే భిక్షమెవరు వేస్తారని అనుకున్నాడో ఏమో కర్కశంగా కాళ్లు చేతులు విరిచేసి బాలుడి చేత భిక్షమెత్తించాడు. ఆపై కసిదీరా తల, శరీరంపై వాతలు పెట్టాడు.
చిత్రహింసలు భరించలేని ఆ చిన్నారి కర్నూు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కర్నూలులో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జూపాడు బంగ్లా మండలం లింగాపురానికి చెందిన గోపాల్(55) పనీపాట లేకుండా తిరుగేవాడు.
వెలుగోడు సమీపంలో నివాసం ఏర్పరచుకున్న గోపాల్... ప్రకాశం జిల్లాకు చెందిన గణేశ్ అనే బాలుడిని తన వెంట తీసుకొచ్చాడు. చిన్నారితో భిక్షాటన చేయించేవాడు. భిక్షాటనకు నిరాకరించిన బాలుడిని గోపాల్‌తో పాటు అతడితో సహజీవనం చేస్తున్న లక్ష్మి ఇద్దరూ కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టేవారు.

ఆ తర్వాత భిక్షాటనకు పంపేవారు. రెండు రోజుల కిందట గణేశ్‌ను గోపాల్ తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలుడు స్పృహ తప్పిపోయాడు. వెంటనే అతడిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. బాలుడి తండ్రి రాజశేఖర్ కొడుకును కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని వైద్యులను నమ్మించాడు.
తీవ్రగాయాలైన గణేశ్‌ను చిన్నపిల్లల వార్డులో చేర్పించాడు. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలైన బాలుడిని చూసి చలించిపోయిన వైద్యులు వెంటనే చిన్నారికి వైద్యం అందించారు. చివరకు పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. విషయం తెలిసిన గోపాల్, లక్ష్మి.. గణేశ్ మృతదేహాన్ని అక్కడే వదిలి పరారయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని గోపాల్, లక్ష్మి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications