• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పైకి తేలుతున్న మృతదేహాలు: ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కొట్టుకెళ్లినట్టు గుర్తింపు

|

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు సమీపంలో పర్యాటకుల లాంచీ రాయల్ వశిష్ఠ గోదావరి నదిలో ప్రమాదానికి గురైన ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన వారందరూ మరణించే ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలకు బలం కలిగిస్తూ.. ప్రమాదం చోటు చేసుకున్న మూడో రోజూ గోదావరి తీరం వెంట ఒక్కటొక్కటిగా మృత దేహాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. సహాయక కార్యక్రమాలు, గల్లంతైన వారి కోసం అన్వేషిస్తోన్న జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మృతదేహాలను పంచనామా కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం నాటికి మరి కొన్ని మృతదేహాలను వారు నదీ ప్రవాహం నుంచి వెలికి తీశారు. దీనితో ఇప్పటిదాకా స్వాధీనం చేసుకున్న మృతదేహాల సంఖ్య 18కి చేరుకుంది.

ఒక్కరోజే 13 మృతదేహాలు..

ఒక్కరోజే 13 మృతదేహాలు..

తాజాగా ఈ ఉదయం ప్రమాదం చోటు చేసుకున్న కచ్చులూరు వద్దే మూడు మృతదేహాలు తీరానికి కొట్టుకుని వచ్చాయి. ఈ మూడింట్లో ఒకటి ఓ బాలుడిది కావడం సహాయక సిబ్బందిని సైతం కంటతడి పెట్టించింది. అలాగే మంటూరు, ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం మహానందీశ్వర స్వామి ఆలయం సమీపంలో రెండు చొప్పున మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లసీమ సమీపంలో మరో మూడింటిని గుర్తించారు. మంటూరు వద్ద లభించిన ఓ మృతదేహాన్ని గుర్తించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ప్యాంటు జేబులో లభించిన ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ల ఆధారంగా.. అతణ్ని నరసాపురానికి చెందిన బీఎస్ ఫణికుమార్ గా నిర్ధారించారు. నదీ ప్రవాహం ఉధృతంగా ఉన్నందున పలు మృతదేహాలు ధవళేశ్వరం బ్యారేజీ వరకు కొట్టుకెళ్లినట్లు గుర్తించారు. దీనితో మిగిలిన వారి కోసం ధవళేశ్వరం వరకూ గాలింపు చర్యలను చేపట్టారు. బోల్తా పడిన లాంచీని వెలికి తీస్తే.. మరి కొన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

రంపచోడవరం, రాజమహేంద్రవరం ఆసుపత్రుల వద్ద విషాద ఛాయలు..

రంపచోడవరం, రాజమహేంద్రవరం ఆసుపత్రుల వద్ద విషాద ఛాయలు..

ఇంకా 24 మంది జాడ తెలియాల్సి ఉంది. ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో- గల్లంతైన వారిలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలి ఉండే అవకాశం లేదని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకూ తమ కుటుంబ సభ్యులు జాడ తెలియ రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. గోదావరిలో లభించిన మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తున్నారు అక్కడి సిబ్బంది. జాడ తెలియరాకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు ఈ రెండు ఆసుపత్రుల వద్ద పడిగాపులు పడుతున్నారు. తిండి మానేసి తమ వారి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మృతదేహం లభించినట్లు సమాచారం అందితే.. తమ వారిదేనేమోననే భయాందోళనలకు గురవుతున్నారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

కొనసాగుతున్న గాలింపు చర్యలు

మరోవంక- ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బలగాలు చేపట్టిన గాలింపు చర్యలు మూడోరోజుకు చేరుకున్నాయి. దశలవారీగా ఆయా బలగాల సిబ్బంది గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. నీట మునిగిన లాంచీలో మరికొన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉన్నందున.. నీటి అడుగు వరకు వెళ్లి మృతదేహాలను గుర్తించడం గజ ఈతగాళ్లకు కూడా సాధ్యం కావట్లేదు. ప్రమాాదం చోటు చేసుకున్న సమయంలో ఉన్నప్పటి వరద తీవ్రతే ఇంకా కొనసాగుతోంది. సుమారు ఆరు లక్షల క్యూసెక్కుల మేర ఉన్న వరద మూడో రోజుకు తగ్గుముఖం పట్టినప్పటికీ.. అది నామమాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అయిదు లక్షల క్యూసెక్కుల వరద ప్రభావం కొనసాగుతోందని తెలిపారు. ఫలితంగా- చాలా వరకు మృతదేహాలు ధవళేశ్వరం వరకు కొట్టుకుని పోయి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఆ దిశగా గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.

English summary
In a massive dawn-to-dusk search operation undertaken by NDRF, SDRF and Navy personnel from Kachuluru, where the tourist boat, Royal Vasishta, capsized, to downstream Dowaleswaram in Rajamahendravaram, for the 25 missing persons, the body of a one-year-old boy, was retrieved, taking the toll to nine in the tragedy. In the Sunday accident, 26 survived.At least 24 are still missing, according to the AP State Disaster Management officials. But unconfirmed reports said at least 35 could still be missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X