"అన్నీ మీరే చేస్తే.. ఇక మేమెందుకు ?"- కేంద్రానికి సుప్రీం చీవాట్లు..!
దేశంలో అన్ని వ్యవస్థల్ని నియంత్రిస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డీయే ప్రభుత్వానికి ఇవాళ సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్, సీబీఐ డైరెక్టర్ వంటి కీలక నియామకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అత్యున్నత న్యాయస్థానం (supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో కేంద్రం ఇరుకునపడింది. అయినా తమ చర్యల్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నించింది.
సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నారని, కానీ ఎన్నికల ప్రధాన అధికారిని ఎంపిక చేసే కమిటీలో మాత్రం ఆయన లేకపోవడం ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన ఎన్నికల ప్రక్రియను నడిపించే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలోనే ప్రజాస్వామ్యం లేకపోవడమేంటని నిలదీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

"నాకు ఒక సందేహం కలుగుతోంది. సీబీఐ డైరెక్టర్ ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అని మనం అనుకోవచ్చు. లేదా దీనిని చట్టబద్ధమైన పాలన అని కూడా భావించవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి లేరా? స్వచ్ఛమైన ఎన్నికలు జరిగేలా చూడటానికి లేరా?" అని విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. సీజేఐ ఉండాలని మనం చెప్పడం లేదని, కానీ ఒక స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదు? మంత్రివర్గం నుంచే ఎందుకు ఉండాలి? మనం చాలా స్పష్టంగా ఉందాం. ఈ రోజు ప్రధానమంత్రి ఒకరిని ఎంపిక చేస్తారు. విపక్ష నేత మరొకరిని ఎంపిక చేస్తారు, వారి మధ్య అభిప్రాయ భేదం ఉంది. మూడో సభ్యుడు ప్రతిపక్ష నాయకుడి వైపే వెళ్తారా? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి తాను ఊహాగానాలు చేయదలచుకోలేదని అన్నారు. అలాగైతే, ప్రతిదీ నియంత్రించేది కార్యనిర్వాహక వర్గమే కదా అని జస్టిస్ దత్తా అన్నారు. ఇలాంటి నియామకాలపై నిర్ణయం వాస్తవానికి 2:1 మెజారిటీతో ఆమోదించబడుతుందని, కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి వైఖరితో విభేదించే అవకాశం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాథమికంగా మమ్మల్ని కలవరపరిచే విషయం ఏమిటంటే, కార్యనిర్వాహక వర్గానికి వీటో అధికారం ఎందుకు ఉంది? ఇన్ని పూర్వపు తీర్పులు ఉన్న తర్వాత కూడా ఈ కేసుల గురించి పార్లమెంటుకు తెలియదా? చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ సుప్రీంకోర్టు అంతిమ నిర్ణేత. మీకు నచ్చినా నచ్చకపోయినా చట్టాలను వ్యాఖ్యానించే అధికారం దానికి ఉంటుందని జస్టిస్ దత్తా స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications