
Ganta Srinivas: గంటాకు వైసీపీ భారీ టాస్క్ - ఆట మొదలు..!!
Ganta Srinivas Rao to join in YCP: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలో ఎంట్రీ దాదాపు ఖరారైంది. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. గంటా వైసీపీలో రాక వేళ కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, వైసీపీ అధినాయకత్వం మాత్రం పక్కా వ్యూహంతోనే గంటాకు గేట్లు ఓపెన్ చేసింది. అందులో భాగంగా ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి..ఒక ప్రముఖ పదవిలో ఉన్న మరో వ్యక్తితో తాజాగా గంటా చర్చలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీలో ఎంట్రీతో పాటుగా.. భవిష్యత్ కార్యాచరణ డిసైడ్ చేసారు. ఆ సమయంలో గంటాకు వైసీపీ నుంచి హామీలతో పాటుగా.. గంటా కు పార్టీ బిగ్ టాస్క్ అప్పగించింది. దీంతో..విశాఖ కేంద్రంగా వచ్చే 15 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీలో ఎంట్రీకి రంగం సిద్దం..
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరటానికి రంగం సిద్దం అయింది. రేపు (డిసెంబర్ 1) గంటా జన్మదినం నాడు తన భవిష్యత్ రాజకీయ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరిక పైన కొంత కాలంగా ప్రచారం సాగుతున్నా..గత వారంలో గతంలో గంటాతో కలిసి పని చేసిన ప్రస్తుత సీనియర్ మంత్రితో పాటుగా ముఖ్యమంత్రి జగన్ సమీప బంధువుతో చర్చలు జరిగాయి. ఫలితంగా గంటా ను పార్టీలో ఎంట్రీకి ఇక ఆలస్యం చేయవద్దని సూచించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో టీడీపీని బలహీనపర్చే ఆపరేషన్ ను వైసీపీ వేగవంతం చేసింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో మధ్యంతర ఉత్తర్వుల తరువాత..టీడీపీ ఒక విధంగా మౌనం పాటిస్తోంది. ఆ పార్టీ పైన మానసికంగా పై చేయి సాధించటానికి ఇదే సరైన సమయంగా టీడీపీ భావిస్తోంది. జనవరి నెలాఖరులోగానే ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి చేరికలను వేగవంతం చేసే విధంగా కార్యాచరణ డిసైడ్ అయింది.

గంటాకు ఆఫర్ - భారీ టాస్క్..
గంటా కు వైసీపీలో చేరే సమయంలో తనతో పాటుగా వచ్చే తన టీంకు అవకాశాల పైన చర్చించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. ప్రధానంగా విశాఖ - అనకాపల్లి జిల్లాల్లో టీడీపీ నేతలు ఎవరెవరు గంటా తో వైసీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారనే జాబితా పైన చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇప్పటి వరకు గంటాతో పాటుగా మరో మాజీ ఎమ్మెల్యేకు మాత్రమే వైసీపీ నుంచి హామీ ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో విశాఖ నగరంలో వైసీపీ వచ్చే ఎన్నికల వేళ పూర్తి పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. విశాఖలో టీడీపీ నేతలతో గంటా కు ఉన్న పరిచయాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ప్రకాశం జిల్లోని ఒక టీడీపీ కీలక నేతకు గంటా ద్వారా వైసీపీలోకి తీసుకొచ్చే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముందుగా గంటా పార్టీలోకి రావటం..ఆ తరువాత దశల వారీగా ఆయన టీం వైసీపీలోకి వస్తుందని చెబుతున్నారు.

చంద్రబాబు లక్ష్యంగా.. కాపు నేతలపై గురి
టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని అంచనాకు వచ్చిన వైసీపీ కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాలు వేగవంతం చేసింది. అందులో భాగంగా విశాఖ నుంచి గంటా, తూర్పు గోదావరి నుంచి ముద్రగడ కుటుంబ సభ్యుల చేరికలు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. మెగాస్టార్ చిరంజీవితో గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో..కొంత కాలంగా రాజకీయాలకు అతీతంగా వైసీపీ మినహా ఇతర పార్టీల్లోని కాపు నేతలు హైదరాబాద్, విశాఖ కేంద్రంగా పలు సార్లు భేటీ అయ్యారు. వారిలో గంటా కీలకంగా వ్యవహరించారు. విశాఖ నగరంతో పాటుగా కాపు ప్రముఖ వ్యక్తులను వైసీపీకి దగ్గర చేసే బాధ్యతలను గంటా తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటుగా విశాఖ పరిపాలనా రాజధాని విషయంలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టే విధంగా వైసీపీ గేమ్ మొదలు పెట్టింది. దీంతో, విశాఖ కేంద్రంగా రానున్న రోజుల్లో ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.