బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ వ్యాఖ్యలు గుర్తు చేసి, విశాఖ మునగదు, పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్న సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారంపై మరోమారు రచ్చ కొనసాగుతోంది. ఇటీవల గ్లోబల్ వార్మింగ్ కారణంగా మరో 80 ఏళ్లలో ముంపుకు గురయ్యే పన్నెండు నగరాలలో విశాఖ నగరం ఉందని నాసా విడుదల చేసిన నివేదిక ప్రస్తుతం ఏపీలో దుమారంగా మారింది. 80 ఏళ్లలో మునిగి పోతుంది అన్న విశాఖ నగరాన్ని రాజధానిగా ఎలా మారుస్తారు అన్న చర్చ టిడిపి నాయకులు మొదలుపెట్టడంపై వైసిపి నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తుందని నిప్పులు చెరుగుతున్నారు.

రాజధాని విశాఖపై రగడ ... క్లారిటీ ఇచ్చిన సాయిరెడ్డి
పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ విశాఖను ప్రకటించిన నాటి నుండి రాజధాని విశాఖపై రగడ కొనసాగుతుంది. రోజుకో రకమైన అవాంతరాలు రాజధానిగా విశాఖ ఏర్పాటుకు కలుగుతున్నాయి. అయినా జగన్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని పరిపాలనా రాజధానిగా విశాఖ నగరమే ఉంటుందని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన అడుగులు కూడా ముందుకు పడుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. ఇక విశాఖ నగరం ముంపుకు గురయ్యే నగరమని పరిపాలనా రాజధానిగా విశాఖ ఉనికిని ప్రశ్నార్ధకంగా మారుస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా మరోమారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

విశాఖ మునగదు .. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు
మొన్నటికి మొన్న సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉన్న విశాఖ మునుగుతుందా ? 11 మీటర్ల ఎత్తులో ఉన్న అమరావతి మునుగుతుందా? ముందు ఏది మునుగుతుంది అని లాజికల్ గా ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి తాజాగా టీడీపీ అనుకూల మీడియా కోరిక తీరటం లేదని విమర్శలు గుప్పించారు. విశాఖ నీటమునిగాలి. తమ జాతి రత్నాన్ని తరిమికొట్టిన ఐదు కోట్ల మంది జలసమాధి అయితే బాగుండు అని రెండేళ్లుగా ఆక్రోశం వెళ్లగక్కుతోంది ఎల్లో మీడియా. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారితో శవాల కుప్పలు కనిపిస్తాయి అనుకుంటే ఆ కోరికా తీరలేదు అంటూ విమర్శించిన విజయ సాయి రెడ్డి భూకంపాలు సునామీల ప్రమాదమేమీ లేదు సుమా అంటూ వైసిపి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటూ పేర్కొన్నారు.

విశాఖ ఏపీ అభివృద్ధికి చుక్కాని లాంటిదన్న యూకే హైకమిషనర్ ఫ్లెమింగ్
అంతేకాదు బావిలో కప్పల్లా పచ్చ మీడియా పైత్యం చూపించుకుంటోంది అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చ మీడియా తన అను'కుల' కోటను దాటి ఆలోచించలేకపోతుందని నిప్పులు చెరిగారు. ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కాని లాంటిదని యూకే హైకమిషనర్ ఫ్లెమింగ్ ప్రశంసించారని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు విశాఖలో అవకాశాలు మెండుగా ఉన్నాయని, పెట్టుబడులకు అనుకూలంగా ఉందని, రాజధానికి, నివాసయోగ్యానికి అనుకూలమైన నగరం విశాఖ అంటూ విజయసాయిరెడ్డి మరోమారు పరిపాలనా రాజధానిగా విశాఖనే అని అంటూ స్పష్టం చేశారు.

వంద నగరాల కన్నా విశాఖ మిన్నగా, పెట్టుబడులకు అనుకూలంగా ఉందన్న ఆండ్రూ ఫ్లెమింగ్
బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ విశాఖ నగరాన్ని సందర్శించిన సందర్భంగా వంద నగరాల కన్నా విశాఖ మిన్నగా ఉందని పేర్కొన్నారని తెలిపారు. ఒకసారి సందర్శిస్తే సాగర నగరానికి మళ్లీ మళ్లీ రావాలని అనిపిస్తుంది అంటూ, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించినా ఎక్కడ ఈ అనుభూతి పొందలేదని ఆయన విశాఖ నగరానికి కితాబు ఇచ్చినట్లు గుర్తు చేశారు. స్పెయిన్, బ్రెజిల్ లోని ప్రముఖ నగరాలకు దీటుగా గ్లోబల్ సిటీగా విశాఖ ఉందని ఆండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారని సాయి రెడ్డి వెల్లడించారు. మనుషులను ఆకర్షించే నగరాలు అభివృద్ధి చెందడం సహజం అంటూ పేర్కొన్న ఆయన, ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కాని లాంటిదని, పెట్టుబడులకు అనుకూలంగా ఉందని, ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారని చెప్పారు.

పరిపాలనా రాజధానిగా విశాఖనే
పరిపాలన రాజధాని కావడం అభివృద్ధి, విస్తరణకు దోహదం చేస్తుందని ఆయన పేర్కొనడం సంతోషకరమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. మొత్తానికి పరిపాలనా రాజధానిగా విశాఖపై నీలినీడలు అలముకుంటున్న వేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నగరాన్ని ఏర్పాటు చేసి తీరుతామని ఈ ఆలోచన నుంచి వెనక్కు పోయేది లేదని మరోమారు వైసిపి స్పష్టం చేసింది. ముఖ్యంగా మొదటి నుండి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని ప్రధానంగా దృష్టి సారించిన విజయసాయిరెడ్డి, ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న అనేక అనుమానాలకు చెక్ పెడుతూ రాజధానిగా విశాఖను ఏర్పరిచి తీరుతామని, విశాఖకు రాజధానిగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని తేల్చి చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పరిపాలనా రాజధాని నిర్ణయం మారదన్న వైసీపీ ఎంపీ
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నుండి, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి, కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించి, ఇక అమరావతిని శాసన రాజధానిగా ఉంచటానికి నిర్ణయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు వ్యవహారంలో ఊహించిన ప్రతిపక్షాల వ్యతిరేకతతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కొంటున్నారు. మొదటి నుండి టీడీపీ విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ నగరం భవిష్యత్ లో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నాసా వెల్లడించిన రిపోర్ట్ కూడా టీడీపీ విమర్శలకు కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ఎన్ని అవాంతరాలు వచ్చిన విశాఖ నగరమే రాజధాని నగరం అని వైసీపీ నాయకులు పదేపదే స్పష్టం చెయ్యటం గమనార్హం.