బూట్లు నాకే స్థితి: విజయసాయిపై బుద్దా తీవ్రవ్యాఖ్యలు, జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయసాయి రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ నవ్యాంధ్ర పరువును తీస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీవి ఊసరవెల్లి రాజకీయాలు అన్నారు.

విజయసాయి రెడ్డిపై బుద్దా నిప్పులు
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేత విజయ సాయి రెడ్డిలు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బుద్ధా నిప్పులు చెరిగారు. ఈ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని వైసీపీ నేతలకు ముందే తెలుసునని ఆరోపించారు. అందువల్లే బీజేపీ ప్రయోజనాలు కాపాడేందుకు రాజీనామా పేరుతో డ్రామాలు ఆడారన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నారన్నారు.

మోడీ బూట్లు నాకే స్థితికి విజయసాయి రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ బూట్లు నాకే స్థితికి విజయసాయి రెడ్డి దిగజారాడని బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుపై ఆయన వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తప్పుడు లెక్కలు రాసి వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్‌కు సహకరించిన వ్యక్తి విజయసాయి రెడ్డి అన్నారు. ఏపీ ఆత్మగౌరవం కోసం తాము ధర్మపోరాట దీక్ష చేస్తుంటే వైసీపీ ఊసరవెల్లిలా రాజకీయ రంగులు మారుస్తోందన్నారు.

జేసీకి బుద్దా వెంకన్న హెచ్చరికలు
బీజేపీ, వైసీపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. అవిశ్వాసానికి మద్దతివ్వకుండా అన్నాడీఎంకే తదితర పార్టీలపై ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అలాగే, అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటానని చెప్పిన సొంత పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై కూడా బుద్దా నిప్పులు చెరిగారు. ఎంపీలకు పార్టీ విప్ జారీ చేసిందని, దానిని ధిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.

మోడీని విమర్శించాల్సి వస్తుందనే వైసీపీ రాజీనామాలు
అవిశ్వాసం సమయంలో నరేంద్ర మోడీని విమర్శించాల్సి వస్తుందనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని మరో టీడీపీ నేత దూలిపాళ్ల నరేంద్ర అన్నారు. యుద్ధరంగం నుంచి పారిపోయిన వైసీపీకి టీడీపీని విమర్శించే హక్కు లేదన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందనే ప్రచారం కొంతకాలంగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తాము వ్యతిరేకమని తెరాస చెబుతున్నప్పటికీ బీజేపీ విషయంలో తెరాస సానుకూలంగానే ఉందని చెప్పారు. టీడీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే తెరాసను ఈ రకమైన వైఖరితో (అవిశ్వాసానికి మద్దతివ్వకూడదనే ఆలోచనతో) ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications