తెరాసకి ఎమ్మెల్యే షాక్, లాంతర్లతో బీజేపీ, కోమటిరెడ్డి నో
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ సమావేశాలు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు మొదట గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్, హరీష్ రావులు మాట్లాడారు. సభ రసాభాసగా కొనసాగకుండా సహకరించాలని హరీష్ విపక్షాలను కోరారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకో, మీడియా దృష్టిని ఆకర్షించేందుకో సభను వినియోగించుకోరాదన్నారు. బంగారు తెలంగాణను సాధించుకునే క్రమంలో, ప్రజా సంక్షేమం కోసం తయారు చేయబడ్డ బడ్జెట్‌ను సభలో సజావుగా ప్రవేశపెట్టేందుకు సహకరించాలన్నారు. బాధ్యతా రహితమైన విమర్శలకు దూరంగా ఉండాలన్నారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు. పన్నులు, కోతలు లేని బడ్జెట్ తమదన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కాగా, కేసీఆర్ అసెంబ్లీలో తెరాస ఎల్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

యాదయ్య ఝలక్
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు ప్రకటించిన చేవెళ్ల శాసన సభ్యుడు యాదయ్య ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాతో సమావేశాలకు హాజరయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యల పైన చర్చ జరిగే విధంగా టీడీపీ పోరాడుతోందన్నారు. గత ఐదు నెలలుగా ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని ఇబ్బందులను సభ దృష్టికి తెస్తామని ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి చెప్పారు.
కాగా, సమావేశాలకు హాజరయ్యేందుకు భారతీయ జనతా పార్టీ సభ్యులు లాంతర్లతో వచ్చారు. రాష్ట్రంలోని విద్యుత్ కోతలపై వినూత్న నిరసన తెలిపేందుకు బీజేపీ ఇలా వచ్చింది. లిబర్టీ చౌరస్తా నుండి బీజేపీ ఎమ్మెల్యేలు లాంతర్లతో వచ్చారు.
బుధవారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు లాంతర్లు చేతబట్టి ర్యాలీగా రావాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న నిర్ణయించారు. తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని బీజేపీ మండిపడింది. విద్యుత్ కోతల నేపథ్యంలోనే రాష్ట్రంలో రైతు ఆత్మహ్యతలు పెరిగాయని కూడా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోతలకు కారణమైన ప్రభుత్వ తీరుకు నిరసనగా లాంతర్లతో అసెంబ్లీకి వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది.
నల్ల కండువా కప్పుకునేందుకు కోమటిరెడ్డి నిరరాకరణ
గన్ పార్కు వద్ద తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో వచ్చారు. అయితే, కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్ల కండువా కప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైబు బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ నుండి ర్యాలీగా వచ్చారు.












Click it and Unblock the Notifications