Pawan Kalyan: పవన్ కోసం టీడీపీలో పెరిగిపోతున్న త్యాగయ్యలు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి వచ్చే ఎన్నికల్లో పొత్తుల రాజకీయానికి తెరలేపిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు తోటి విపక్షం టీడీపీ నుంచి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా తమ సీట్లు త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ పోటీకి లైన్ క్లియర్ చేసేందుకు నేతలు సిద్ధమైపోతున్నారు. ఇది ఓ అనూహ్య పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వీరి ఆఫర్లకు పవన్ ఇప్పటివరకూ స్పందించలేదు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు సిద్దమయ్యాయి. బీజేపీ కలిస్తే సరి, లేకపోతే వీరిద్దరూ కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది టీడీపీ నేతలు ఈ పొత్తు వల్ల తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయో అన్న ఆందోళనలో ఉన్నారు. అదే సమయంలో జనసేన కోసం, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కోసం తమ సీట్లు త్యాగం చేస్తామంటూ మరో వర్గం కూడా ముందుకొస్తోంది. అదీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన కాపులు కాకుండా టీడీపీ సొంతమని భావిస్తున్న కమ్మ సామాజిక వర్గ నేతలే కావడం మరో విశేషం.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్దమని టీడీపీలో కమ్మ నేత అయిన దెందులూరు నేత చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం ఆఫర్ ఇచ్చేశారు. అనంతపురం అర్బన్ సీటులో టీడీపీ ఎమ్మెల్యేగా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ప్రభాకర్ చౌదరి.. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని బహిరంగంగానే ప్రకటించారు.
అయితే అనంతపురం అర్బన్ సీటులో పోటీకి జనసేన నేతలు టికెట్ కోరుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నారు. అదే సమయంలో వీరికి చెక్ పెట్టేలా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తన సీటు త్యాగం చేస్తానని, స్ధానిక నేతల కోసం అయితే తాను త్యాగం చేయబోనని ప్రభాకర్ చౌదర్ కూడా చెప్పేస్తున్నారు. దీంతో పవన్ కోసం టీడీపీ నేతల త్యాగాలపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications