
బస్సు ప్రమాదంపై ఏపీగవర్నర్ విచారం; సీఎస్ కు కిషన్ రెడ్డి ఫోన్; పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి!!
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 13 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించి, ప్రమాద బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘోర బస్సు ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆర్టీసీబస్సు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి; మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
జంగారెడ్డిగూడెం సమీపంలో రెయిలింగ్ ఢీకొని ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులో పడిపోయిన ఘటన బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా 9 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధాకరమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు గవర్నర్ హరిచందన్. సహాయక చర్యలను వేగవంతం చేసి మృతుల సంఖ్య పెరగకుండా చూడాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.

ప్రమాద ఘటనపై ఏపీ సీఎస్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఇదిలా ఉంటే బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి బస్సు ప్రమాద ఘటనలో పది మంది చనిపోవడం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ సి ఎస్ కు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ళ నాని
ఇదిలా ఉంటే మరోవైపు జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన ఆయన జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బస్సు బోల్తా ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.
Recommended Video

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందిచాలన్న జనసేనాని
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బస్సు ప్రమాద ఘటనలో పది మంది మృతి చెందారనే విషయం తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల్లేరు వాగులో బస్సు పడిపోవడం దురదృష్టకరమని పేర్కొన్న ఆయన, ఇది చాలా బాధాకరమైన ప్రమాదమని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిని కాపాడాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. జనసైనికులు సహాయక కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధ్యయనం చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.