నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!
ప్రధాని మోదీ మిషన్ 2029 మొదలు పెట్టారు. ప్రభుత్వం .. పార్టీలో తన మార్క్ నిర్ణయాల అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసారు. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ.. ఇక ప్రభుత్వంలో అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురి శాఖల మార్పుల ఖాయం గా కనిపిస్తోంది. ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి.
కేంద్ర కేబినెట్ లో కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో.. ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలువురు సీనియర్ మంత్రుల శాఖలు మార్పు చేయనున్నారు. దాదాపు 17 మందిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉందని తెలుస్తోంది. మరి కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక, కీలక శాఖలు పర్యవేక్షిస్తున్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయనున్నారు. టాప్ -3 లో ఉన్న హోం, రక్షణ, రవాణా శాఖల్లో మార్పుకు అవకాశం లేదని తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం ఆర్దిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు విద్య శాఖ కేటాయించే అవకాశం ఉంది. నీట్.. సీబీఎస్ఈ వివాదంతో ఆత్మరక్షణలో పడే పరిస్థితి రావటంతో ధర్మేంద్ర ప్రధాన్ శాఖను నిర్మల కు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే విధంగా వాణిజ్య శాఖ పర్యవేక్షిస్తున్న పీయూష్ గోయల్ కు ఆర్దిక శాఖ అప్పగిస్తారని అంచనా.

ఈ నెల 20వ తేదీ కేబినెట్ ప్రక్షాళన దిశగా..!
కాగా, రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ కు వాణిజ్య శాఖ అప్పగించే ఛాన్స్ ఉందని సమాచారం. కొత్తగా ప్రక్షాళన మొత్తం 2029 ఎన్నికలే టార్గెట్ గా ఎలక్షన్ టీంగా ఉండనుంది. దీనికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. హౌసింగ్ మంత్రి మనోహర్ కట్టర్ ను గవర్నర్ గా పంపే అవకాశం ఉంది. అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు పార్టీ సంస్థాగత బాధ్యతలు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. సహాయ మంత్రుల్లో నలుగురి మార్పు ఖాయమని తెలుస్తోంది. ఏడాది కాలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కేంద్ర మంత్రివర్గంలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక, ఆర్దిక శాఖల్లో పట్టున్న ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్లకు సహాయక మంత్రులుగా అవకాశం దక్కనుంది. ఇక ఏపీ నుంచి మరో సహాయ మంత్రి, తెలంగాణ నుంచి మరో ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయని పార్టీ నేతల సమాచారం. దీంతో.. మోదీ మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications