ఒడిశాలో లోయలో పడ్డ బస్సు: ఏపీకి చెందిన ఒకరు మృతి, 40మందికి గాయాలు
భువనేశ్వర్/విజయవాడ: ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు అడ్డంగా బండలు ఉండటంతో వాటిని తప్పించేందుకు బస్సును పక్కకు తీసుకెళ్లగా అదుపులో బస్సు లోయలో పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఒకరు మృతి చెందగా, మరో 10మంది పరిస్థితి విషమంగా ఉంది.
బస్సులోని ప్రయాణికులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొంపిచర్ల, నర్సరావుపేట, ఈపూరులకు చెందినవారుగా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది.
తీర్థయాత్రల నిమిత్తం ఏపీకి చెందిన వీరంతా ఒడిశాకు పయనమయ్యారు. పూరి నుంచి కోణార్క్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అక్కడి అధికారులు, పోలీసులు గాయపడిన వారిని కటక్ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుకు అడ్గంగా బండలను దోపిడీ దొంగలే పెట్టిఉంటారని అనుమానాలువ్యక్తమవుతున్నాయి.
అయితే, బస్సులోని లక్ష్మీనారాయణ అనే ప్రయాణికుడు ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. 8 అడుగుల లోతున్న లోయలో బస్సు పడిపోయిందని, దీంతో 40మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు. ఒకరు మృతి చెందారని తెలిపారు.

కాగా, ఘటనపై సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బాధిత ప్రయాణికులకు అవసరమైన సాయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప ప్రమాదంపై ఆరా తీశారు. బాధిత ప్రయాణికులకు సాయం అందించి, వారిని స్వస్థలాకు చేర్చాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ డీజీపీ రాముడు ఒడిశా డీజీపీకి ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకున్నారు. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications