రాజధాని కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం: బైరెడ్డి

నగరంలో శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరి జడ్పీ ఆవరణంలోని దీక్షా శిబిరాన్ని బైరెడ్డి చేరుకున్నారు. ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సమైక్యాంధ్రలో ఎక్కువ నష్టపోయింది రాయలసీమేనన్నారు. తెలుగువారందరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఆనాడు కర్నూలు రాజధానిని హైదరాబాద్‌కు తరలించినా నోరు మెదపలేదన్నారు. నేడు తెలంగాణతో పాటు వడ్డించిన విస్తరిలాంటి హైదరాబాద్‌ను కూడా తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కోస్తా నాయకులతో తాము కలిసి బతికే ప్రసక్తే లేదన్నారు. కొందరు విజయవాడలోగానీ, విశాఖపట్నంలోగానీ రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి తాము ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇస్తే రాయలసీమకు రాజధాని ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందేనని బైరెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు వైయసస్ జగన్ రాయలసీమలో రాజధాని కోసం కూడా లేఖలు ఇవ్వాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా విషయంపై లేఖ ఇచ్చిన తర్వాతే పార్టీ పెట్టుకోవాలని, లేకుంటే సీమాంధ్రలో ఆయన పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.
నాడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది కూడా తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ కోసం కాదని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. అప్పటి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమకే చెందవలసి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాయలసీమ వాదం వినిపించే ఆర్‌పీఎస్ నాయకులను మాత్రమే గెలిపించాలని బైరెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications