హత్య కేసు: కోర్టు ముందు లొంగిపోయిన బైరెడ్డి
కర్నూలు: ఓ హత్య కేసులో నిందితుడైన నందికొట్కూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారం కర్నూలు కోర్టులో లొంగిపోయారు. ఆయన గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హత్య కేసులో ఆయన నిందితుడు. కోర్టుకు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈశ్వరుడి హత్య కేసులోని 12 మంది నిందితుల్లో పలువురు ఇప్పటికే లొంగిపోగా బైరెడ్డి తండ్రి శేషసేనారెడ్డి, సోదరుని కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇటీవలే కోర్టులో లొంగిపోయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఆ క్రమంలోనే తాను లొంగిపోయానని బైరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు. తనకు సాయి ఈశ్వరుడిని హత్య చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయంగా తనను దెబ్బ తీయడానికే అక్రమ కేసులు బనాయించారని ఆయన అన్నారు.

తన తండ్రి హత్య వెనక బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, సోదరుడి కుమారుడు సిద్ధార్థ రెడ్డి, మరికొందరు ఉన్నారంటూ మృతుని కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఏప్రిల్ నెలలో తనపై పోలీసులు నమోదు చేసి తీసుకునే చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, బైరెడ్డి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు.
హత్యా స్థలంలో నిందితుల్లో ఒకడిగా భావిస్తున్న కె బాషా సెల్‌ఫోన్‌ను పోలీసులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. దీని ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య సంఘటనలో పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.
సాయి ఈశ్వరుడు కేసుపై బైరెడ్డి సతీమణి భారతి అప్పట్లోనే స్పందించారు. సాయి ఈశ్వరుడు హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే తమ పైన కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి ఈశ్వరుడు కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications