పల్నాడు పౌరుషం చూపించండి.. నిర్మలమ్మ సంచలన పిలుపు!
పల్నాడు పౌరుషానికి కేరాఫ్ అడ్రస్ అని, ఇక్కడి ప్రజలు ఆ పౌరుషాన్ని వ్యాపార రంగంలోనూ చూపించి లాభాలు గణించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష మేరకు బ్యాంకులు ప్రజల చెంతకు వచ్చి సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన భారీ 'క్రెడిట్ అవుట్ రీచ్' (రుణమేళా) కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద మొత్తం 1,03,246 మంది లబ్దిదారులకు రూ.3,216 కోట్ల భారీ రుణాలను వారి చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, బాలికలకు సైకిళ్లు, వివిధ రంగాల లబ్దిదారులకు రుణ వితరణ పత్రాలు, చెక్కులను పంపిణీ చేశారు.

హామీ లేకుండానే రుణాలు: నిర్మలా సీతారామన్
సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ, వీధి వ్యాపారులకు సైతం ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి, వారి వ్యాపారాలకు సహకరించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. "తోపుడు బండి వ్యాపారులు మార్కెట్లో మధ్యవర్తుల నుంచి రూ.1000 అప్పు తీసుకుంటే, రూ.900 మాత్రమే చేతికి వస్తాయి. సాయంత్రానికి రూ.1000 కట్టాలి. ఇలాంటి అధిక వడ్డీల వల్ల వారికి మిగిలేది ఏమీ లేదు. అందుకే, ఎలాంటి హామీ (గ్యారంటీ) లేకుండా, తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నాం. మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లి మోసపోవద్దు," అని ఆమె సూచించారు.
2004 నుంచి 2014 వరకు ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో 'ఫోన్ బ్యాంకింగ్' ద్వారా ఎవరికి అప్పులు ఇవ్వాలో పైనుంచి నిర్దేశించేవారని, కానీ మోదీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయని ఆమె విమర్శించారు. ఇప్పుడు అర్హత ఉంటే చాలు, బ్యాంకులే గ్రామ గ్రామానికి వెళ్లి రుణాలు ఇస్తున్నాయని, నరసరావుపేట కార్యక్రమమే దీనికి నిదర్శనమని అన్నారు. 2047 నాటికి భారతదేశం 'వికసిత్ భారత్'గా, అగ్రగామి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే లక్ష్యమని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.
పేదరికం లేని సమాజమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సంక్షేమమైనా, అభివృద్ధి అయినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకోకుండా, ఎస్హెచ్జీలు, వ్యాపారవేత్తలు, వీధి వ్యాపారులకు బ్యాంకులు నేరుగా రుణాలు అందించటం అభినందనీయమన్నారు. "వ్యవసాయ రంగానికి రూ.2,363 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.325 కోట్లు, గృహ, విద్య, వాహన, సౌరవిద్యుత్ రంగాలకు రూ.624 కోట్లు రుణాలు అందాయి. ఈ బ్యాంక్ రుణం ఒక రైతు భవిష్యత్తుకు, యువత ఆశయానికి, మహిళా సాధికారితకు పెట్టుబడిగా నిలుస్తుంది," అని సీఎం అన్నారు.
కేంద్ర మంత్రిపై ప్రశంసలు, రాష్ట్రాభివృద్ధిపై హామీ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు ఆకాశానికెత్తారు. ఎన్పీఏలపై కఠినంగా వ్యవహరించి, దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి ఆమె అని కొనియాడారు. జీఎస్టీ స్లాబ్‌లను సందిగ్ధం లేకుండా సవరించి, పన్ను భారం తగ్గించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచారని ప్రశంసించారు. మహిళలందరికీ ఆమె ఆదర్శమని పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రం నిలబెట్టిందని, అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్లకు ఆర్థిక సహకారం అందించిందని తెలిపారు. రాయలసీమను రూ.40 వేల కోట్లతో హార్టీ కల్చర్ హబ్‌గా మార్చేందుకు కేంద్రం సహకరిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీలకు చేసిన అప్పులను రీ షెడ్యూలు చేయడం వల్ల రాష్ట్రానికి రూ.1538 కోట్లు ఆదా అయిందని వివరించారు.
డ్వాక్రా మహిళలే మేటి
రాష్ట్రంలోని 10 లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్ల పొదుపుతో దేశంలోనే మేటిగా నిలిచాయని, రుణాల రీ పేమెంట్‌లోనూ 99.5 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారని చంద్రబాబు మహిళలను అభినందించారు. 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్' కార్యక్రమం ద్వారా వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మారుస్తామని, 2047 నాటికి ఏపీని 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ'గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications