రోజంతా సస్పెన్స్: ఇంటికి బండారు, కూతురు పెళ్లి తర్వాత బాబుతో తాడోపేడో
ఏపీ కేబినెట్లో చోటు దక్కుతుందని భావించి, అది జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వెన్నెలపాలెంలోని తన ఇంటికి చేరుకున్నారు.
విశాఖ: ఏపీ కేబినెట్లో చోటు దక్కుతుందని భావించి, అది జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వెన్నెలపాలెంలోని తన ఇంటికి చేరుకున్నారు.
ఆదివారం మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో పార్టీ నాయకులు, అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు గురయ్యారు. ఇరవై నాలుగు గంటల ఉత్కంఠకు తెరదించుతూ బండారు ఇంటికి చేరుకున్నారు.
బండారు ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న అనుచరులు, అభిమానులు, అధిక సంఖ్యలో తరలివచ్చి ఆయనను కలుసుకున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని వారంతా బండారు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
తామంతా ఆందోళన చేస్తామని అనుచరులు బండారు వద్ద ప్రతిపాదించగా అలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. మంత్రి పదవి ఇవ్వడం, ఇవ్వకపోవడం అధిష్ఠానం ఇష్టమని, అందువల్ల ఎవరూ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. అధిష్ఠానం చెప్పినట్టే మనమంతా నడుచుకోవాలని అనుచరులకు నచ్చ చెప్పారు.
కుమార్తె వివాహం తర్వాత తాడోపేడో
మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణ మూర్తి ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. జూన్ 14న బండారు చిన్న కుమార్తె శ్రీశ్రావ్య వివాహం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడుతో విశాఖలో జరగనుంది.
పెళ్లి జరిగేంత వరకూ సంయమనం పాటించాలని బండారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు అధిష్ఠానంతో కూడా అంటీముట్టనట్టు ఉండాలని నిర్ణయించారని సమాచారం. పార్టీలో సీనియర్‌నైన తనకు అధిష్ఠానం తగిన గుర్తింపునివ్వడం లేదని సన్నిహితుల వద్ద బండారు ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications