రుషికొండ భవనాల వినియోగం పై కీలక నిర్ణయం, ఇక..!!
రుషికొండ భవనాల వినియోగం పైన కీలక నిర్ణయం జరిగింది. జగన్ హయాంలో విశాఖలోని రుషికొండలో నిర్మించిన భవనాల పైన రాజకీయంగా అనేక విమర్శలు వచ్చాయి. జగన్ తన విలాసాల కోసం ఈ భవనాలను నిర్మించారని కూటమి నేతలు ఆరోపించారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ భవనాల వినియోగం పైన అనేక చర్చలు జరిగాయి. దీని పైన ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రుషికొండ భవనాల నిర్మాణం జరిగింది. ఈ భవనాలను జగన్ తన వ్యక్తిగత విలాసాల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసారని కూటమి నేతలు వరుస ఆరోపణలు చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు నేతలు ఆ భవనాలను సందర్శించారు. వీటిని ఏ విధంగా వినియోగం లోకి తీసుకురావాలనే అంశం పైన మాత్రం నిర్ణయానికి రాలేదు. తాజాగా పవన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన వీటి ద్వారా ఆదాయం వచ్చేలా వినియోగించాలని కొన్ని సూచనలు చేసారు. ఇక.. రుషికొండ భనవాల వినియోగం సై సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ రోజు సమావేశం అయింది. అధికారులు నిర్మాణ వివరాలు..ఖర్చు గురించి వివరించారు.

ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీఎస్‌బీవీ స్వామి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.రుషికొండను ప్రజాప్రయోజనకర వినియోగానికి సబ్ కమిటీ సిఫార్సులు చేసింది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ ప్యాలెస్ వల్ల నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని అభిప్రాయపడింది. గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ, చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం లో చర్చించారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. రుషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేపట్టింది. త్వరలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది.












Click it and Unblock the Notifications