కాల్ మనీ దందా: వంగవీటి రాధా మేనమామ అరెస్టు, వెలుగులోకి మరో స్కామ్
విజయవాడ: కాల్ మనీ దందా మోసాలు ఒక్కటొక్కటే బయపడుతున్నాయి. కాల్ మనీ దందాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధ మేనమామ చెన్నుపాటి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్ మనీ దందాలో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కూడా పాలు పంచుకున్నట్లు వెలుగు చూడడంతో దాని తీవ్రత తెలిసి వస్తోందని అంటున్నారు.
విజయవాడ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి కాల్ మనీ దందా బాధితులు బారులు తీరారు. ఈ క్రమంలో మరో కుంభకోణం వెలుగు చూసింది. రిటైర్డ్ కానిస్టేబుల్ నీలాంబరం భారీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐదు వేల రూపాయలు వడ్డీకి ఇచ్చి అతను 40 వేలు వసూలు చేసుకోవడమే కాకుండా ప్రామిసరీ నోట్ ఇవ్వకపోవడమే కాకుండా తమను బెదిరిస్తున్నాడని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రామాంజనేయ ఫైనాన్స్‌కు చెందిన వెనిగళ్ల శ్రీకాంత్, యలమంచిలి రాజు తమను వేధిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. తాడిగడపలో కాల్ మనీ పేరుతో 11 లక్షల రూపాయల తీసుకున్న సత్యబాబుకు చెందిన కోటిన్నర విలువైన ఇంటిని వ్యాపారులు స్వాధీనం చేసుకున్నట్లు ఫిర్యాదు అందింది.
బడా నేతల పేర్లు బయటకు రాకుండా ఓ ముఖ్య నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాల్ మనీ దందాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. కాల్ మనీ వ్యాపారులు రాజకీయ నాయకులకు అమ్మాయిలను ఎర వేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications