ఆపగలరా!: జూఎన్టీఆర్‌పై హరీష్‌కు బొజ్జల, రేవంత్‌పై కేసు
హైదరాబాద్/చిత్తూరు/నల్గొండ: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నారని చెప్పడం సరికాదన్నారు. అది అవాస్తవమన్నారు.
హరీష్ రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. రాజకీయ జీవితే ఒకరు ఇస్తే వచ్చేది కాదన్నారు. ఎవరి అభిరుచుల ప్రకారం వారు నడుచుకుంటారని చెప్పారు. కాగా, శేషాచలం అడవుల పైన శాటిలైట్‌తో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అడవిలో చెట్లను నరుకుతున్నప్పుడే గుర్తించి పట్టుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రేవంత్ రెడ్డి పైన కేసు
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన అసత్య ఆరోపణలు చేశారంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన నల్గొండలోని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఈ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు శాసన సభ సమయాన్ని వృథా చేయడం నేరమన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఎంపీ కల్వకుంట్ల కవిత పైన తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆయన తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సీడీ రూపంలో స్పీకర్ మధుసూదనాచారికి గురువారం అందజేశారు. సమగ్ర సర్వేలో భాగంగా కవిత రెండు చోట్ల తన పేరు నమోదు చేసుకుందని మంగళవారం రేవంత్ విషయం తెలిసిందే.
దీనిపై తెరాస సభ్యులు బుధవారం రేవంత్ రెడ్డిపై మూకుమ్మడి మాటల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో తన ఆరోపణలు అవాస్తవాలు కాదని, వాటికి సంబంధించిన ఆధారాలను సభ ముందు పెడతానని ఆయన ప్రకటించారు. తన ప్రకటనకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ఆధారాలతో కూడిన సీడీని స్పీకర్ కు అందజేశారు. అందులోని ఆధారాలు పరిశీలించాల్సి ఉంది.
కవిత మాటేమిటి?: నర్సిరెడ్డి
మాది ఈ దేశమే కాదు అంటూ గత పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి దేశ ప్రజలను ఎంపీ కవిత అవమానించలేదా.. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా అని టీడీపీ శాసన మండలి నేత అరికెల నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్కలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో అమరవీరులను, కళకారులను, విద్యార్థులను అవమానిస్తూ మాట్లాడినప్పుడు తెరాస నేతలు ఎందుకు స్పందించలేదన్నారు. శాసన సభ తెరాస ప్లీనరీగా మారిందన్నారు.












Click it and Unblock the Notifications