ఏపీలో టీడీఆర్ బాండ్ల అవినీతి నిరూపణ సాధ్యమేనా ? మరో ఇన్ సైడర్ ట్రేడింగ్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బాండ్ల రూపంలో రూ.50 వేల కోట్ల వరకూ అవినీతి జరిగిందని టీడీపీ పదే పదే అరోపిస్తోంది. ఇవే ఆరోపణల్ని ఇప్పుడు అధికారుల ముందు ఉంచి మున్సిపల్ మంత్రి నారాయణ వాటిని వెలికి తీయాలని అదే పనిగా ఆదేశాలు ఇస్తున్నారు. కానీ అంతే వేగంగా వారి నుంచి వివరాలు మాత్రం రావడం లేదు. దీంతో ఈ వ్యవహారం మరో అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ తరహాలో మిగిలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీఆర్ బాండ్ల అవినీతి:
సాధారణంగా ప్రభుత్వాలు రోడ్ల విస్తరణ లేదా మరేదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రైవేటు స్ధలాలు సేకరిస్తుంటాయి. ఇలా సేకరించిన ప్రైవేటు స్ధలాల యజమానులకు టీడీఆర్ (ట్రాన్స్ ఫరబుల్ డెవలప్ మెంట్ రైట్స్) బాండ్లు జారీ చేస్తుంటాయి. వీటిని భవిష్యత్తులో వాటి ధర ఆధారంగా విక్రయించుకునేందుకు సదరు యజమానులకు అవకాశం ఉంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకూ పనికి రాని చాలా స్ధలాల్ని అనూహ్యంగా ధరలు పెంచేసి ప్రభుత్వం పేదలకు ఇళ్లతో పాటు ఇతర కార్యక్రమాల కోసం చేపట్టిన ప్రాజెక్టులకు విక్రయించి పార్టీ నేతలు బినామీలతో టీడీఆర్ బాండ్లు తీసుకున్నారనేది టీడీపీ ఆరోపణ.

టీడీఆర్ బాండ్లపై విచారణ:
ఇలా వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పట్టణాలు, నగరాల్లో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల ద్వారా జరిగిన అవినీతిని వెలికితీసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇలా తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి సహా పలు చోట్ల జరిగిన అవినీతిపై ఇప్పటికే స్ధానిక కలెక్టర్లు, ఇతర అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ హడావిడిగా పూర్తి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతీ స్దలం ప్రభుత్వానికి ఎలా విక్రయించి టీడీఆర్ బాండ్లు తీసుకున్నారనేది తేలాలంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉందనేది కీలకం. మొత్తంగా ఇదో తేనెతుట్టె లాంటిది. అందుకే దీనిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేయలేకపోతోంది.
అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పోలిక:
గతంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ అంతకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని, రాజధాని ఎక్కడ వస్తుందే ముందే టీడీపీ నేతలకు చెప్పి అక్కడ స్థలాలు కొనేలా చేసిందని వైసీపీ ఆరోపించేది. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకూ వెళ్లినా అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ నిరూపణ సాధ్యం కాలేదు. ఇప్పుడు దీని అడుగు జాడల్లోనే టీడీఆర్ బాండ్ల అవినీతి జరిగిందన్న చర్చ జరుగుతోంది.
టీడీఆర్ బాండ్ల అవినీతి నిరూపణ సాధ్యమేనా ?
టీడీఆర్ బాండ్ల అవినీతిని నిరూపించేందుకు కూటమి సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులో అధికారుల పాత్ర కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల సాయం లేకుండా వైసీపీ నేతలు ఇలా టీడీఆర్ బాండ్ల ద్వారా అవినీతికి పాల్పడే అవకాశం లేదు. ఇప్పుడు అదే అధికారుల్ని కూటమి సర్కార్ టీడీఆర్ బాండ్ల అవినీతి వెలికితీయాలని ఒత్తిడి తెస్తోంది. దీంతో వారు తాము తప్పు చేసినా అంగీకరించే పరిస్ధితి సహజంగానే ఉండదు. ఒకవేళ ఒకరిద్దరు అంగీకరించినా కోర్టుల వరకూ వెళ్లే సరికి ఇది కూడా మరో ఇన్ సైడర్ ట్రేడింగ్ లాగే ఊహాజనిత ఆరోపణ తరహాలోనే మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల అవినీతిని నిరూపిస్తే అద్భుతమే అవుతుంది.












Click it and Unblock the Notifications