క్యాపిటల్ అమరావతి.. ఆరులైన్లతో ఎలివేటేడ్ కారిడార్.. ప్లాన్ ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన అనుసంధాన రహదారిగా ప్రభుత్వం సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని ప్రాజెక్టులలో రోడ్డు కనెక్టివిటీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన సీఎం చంద్రబాబు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులపైన దృష్టి సారించారు. ఇందులోభాగంగా అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ 3ని జాతీయ రహదారి వరకు విస్తరించడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్ లు, అండర్ పాస్ లు
దొండపాడు నుండి వెంకటపాలెం వరకు నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుండి మణిపాల్ వద్ద నేషనల్ హైవే 16 లో కలపాలని నిర్ణయించింది. 45వ ప్యాకేజీలో భాగంగా రెండవ దశలో సీతానగరం నుండి మణిపాల్ ఆసుపత్రి వరకు సుమారు 613.30 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్ లు, అండర్ పాస్ లు నిర్మాణం చేయనున్నారు.

ప్రాజెక్ట్ స్వల్ప మార్పులతో అంచనాలు సవరించేందుకు జీవో
2024 చివరిలో ప్రభుత్వం ఈ అంచనాలను రూపొందించినప్పటికీ ప్రాజెక్టులో స్వల్ప మార్పులతో గతంలో ఉన్న అంచనాలు సవరించేందుకు శుక్రవారం జీవో RT 1089 విడుదల చేసింది. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రాజెక్టులో స్వల్ప మార్పులతో గతంలో ఉన్న అంచనాలను సవరించడానికి ఏపీ సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ ను కమిటీ చైర్మన్ గా, ఏడిసిఎల్ చీఫ్ ఇంజనీర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
అంచనాల సవరణకు కమిటీ, సభ్యులు వీరే
ఈ కమిటీలో ఆర్ అండ్ బి, పబ్లిక్ హెల్త్, ఏపీ సిఆర్డిఏ ఈఎన్సీలు , గుంటూరు ఆర్డీవో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రాజెక్టు విషయంలో గత అంచనాలను సవరిస్తారు. ఇక ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ కట్ట వరకు ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జ్, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్ పాస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్ చేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.
60 కోట్ల రూపాయల ఖర్చు పెరిగే అవకాశం
ఈ ప్లాన్ లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల కారణంగా 60 కోట్ల రూపాయల ఖర్చు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి జాతీయ రాష్ట్ర రహదారులతో పాటు విజయవాడ నగరం నుంచి రాజధానికి ఇప్పటికే సరైన అనుసంధానం రోడ్డు లేదని విమర్శల నేపథ్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి దృష్టి సారించిన ప్రభుత్వం దీనిని త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది.
విజయవాడ నగరాన్ని అమరావతి తో కలిపే సీడ్ యాక్సిస్ రోడ్
ప్రస్తుతం అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ E3 రోడ్డును విజయవాడ నగరాన్ని అమరావతి తో కలిపే కీలకమైన ఫ్లైఓవర్ రోడ్డును నిర్మించడంతో పాటు నేషనల్ హైవే కి కనెక్టివిటీని పెంపొందించే విధంగా ప్లాన్ చేశారు.ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు ను E3 ను 21 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు.
రెండు దశలుగా E3 రోడ్డు పనులు
E3 రోడ్డుకు సంబంధించి మొదటి దశను ఏ, బీ లుగా విభజించి దొండపాడు నుండి వెంకటపాలెం వరకు 1ఏ లో 532 .14 కోట్లు, 1 బి లో వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు 303 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని లెక్క కట్టారు. ప్రస్తుతం 1బీ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు సంబంధించిన అంచనాలలో మార్పులు చోటు చేసుకోవటంతో మరో 60 కోట్ల బడ్జెట్ పెరగనుంది.












Click it and Unblock the Notifications