చంద్రబాబు తల తెగనరుకుతాం: వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరిపై కేసు నమోదు
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తల తెగనరుకుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు గాను తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతపల్లి, పాడేరు, అరకు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు.
విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో 124(ఎ) 307, 506, 511 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని చింతపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గురువారం చింతపల్లి ఆర్టీసీ మైదానంలో వైసీపీ ఓ బహిరంగ సభను నిర్వహించింది.
ఈ సభలో పాల్గొన్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో ఈశ్వరి మాట్లాడుతూ, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో సీఎం చంద్రబాబు నాయుడు తల తెగ నరుకుతామని ఆవేశపూరితంగా ప్రసంగించడంతో పాటు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు.

చంద్రబాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగా ఆమె అభిర్ణించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ నిషేధిత మావోయిస్టులు ముగ్గురు టీడీపీ గిరిజన నేతలను అపహరించిన ఘటనను ప్రస్తావించిన ఈశ్వరి, పార్టీ జెండా మోసిన గిరిజనులకు కష్టం వస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు.
బాక్సైట్ గనుల తవ్వకాలపై పోరాటానికి మద్దతుగా తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె, టీడీపీ అభ్యర్థికి డిపాజిట్‌ను కూడా గల్లంతు చేస్తానని సభకు హాజరైన ప్రజల ముందు చెప్పారు. ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ వస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆమె సవాల్ విసిరారు.
దీనిపై ఏపీ పోలీసులు న్యాయసలహాలు తీసుకొని, ఆమెపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఈరోజు మధ్యహ్నాం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని చింతపల్లి సీఐ చెప్పారు.












Click it and Unblock the Notifications