వైఎస్ భాస్కర్ రెడ్డికి దక్కని ఊరట
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకా హత్యకేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 14వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. సీబీఐ అధికారులతో కూడిన ప్రత్యేక బృందం పులివెందులలో ఆయనతో పాటు గజ్జెల ఉదయ్ కుమార్‌ను అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌కు తరలించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వారికి రిమాండ్‌కు పంపించింది.

వివేకానంద రెడ్డి తన నివాసంలో హత్యకు గురైన రోజు శివశంకర్‌తో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం అక్కడి నుంచి నేరుగా వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి ఉదయ్ కుమార్ రెడ్డి వెళ్లాడని సీబీఐ అనుమానిస్తోంది. ఈ కోణంలో సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. ఇందులో భాగంగానే వారిద్దరినీ అరెస్ట్ చేసింది సీబీఐ.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇదివరకు పిటీషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఈ మధ్యాహ్నం సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 5వ తేదీ నాడే సీబీఐ అధికారులు కూడా తమ కౌంటర్‌ను కోర్టులలో దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లను కలిపి సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ తరఫు న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కుమారుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఏ8గా ఉన్నారని, దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని వాదించారు. ఈ కేసును ముగించడానికి సుప్రీంకోర్టు కూడా డెడ్ లైన్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దశలో భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడమంటూ జరిగితే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.

భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ- ఏప్రిల్ 14వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారని, ఇప్పటివరకూ జరిగిన విచారణ సందర్భంగా అన్ని విషయాలనూ వారికి వివరించారని తెలిపారు. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న అవినాష్ రెడ్డిని కూడా ఏడుసార్లు సీబీఐ విచారించిందని, వారి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించలేకపోయిందని అన్నారు.
భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన వాదనలతో సీబీఐ కోర్టు ఏకీభవించలేదు. దర్యాప్తు కీలక దశకు చేరుకున్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ను కొట్టి వేసింది. ఆయనను రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ చంచల్ గూడలోని కేంద్ర కార్యాలయంలో విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications