అదే పనిగా విజయ్, ఆధవ్ అర్జునపై విమర్శలు, వీడియోలు: యూట్యూబర్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్ మరిదాస్ అరెస్ట్ అయ్యారు. ఆయనను చెన్నై సిటీ పోలీసులు కొద్దిసేపటి కిందటే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేయడం, దీనికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోండటం.. దీనికి కారణమైంది. విజయ్, ఆధవ్ అర్జున, ఇతర మంత్రులపై ఆయన చేసిన విమర్శలు, పోస్ట్ చేసిన వీడియోలు వివాదాస్పదం కావడం వల్ల పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
టీవీకే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైన ప్రారంభ రోజుల నుంచీ మరిదాస్ విమర్శలు చేస్తోన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వంపై ఆయన చేస్తున్న వరుస విమర్శలు, ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని చెన్నై సైబర్ క్రైమ్ విభాగం అధికారులు ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేశారు. మరిదాస్ స్వస్థలం మధురై. దీంతో చెన్నైకు చెందిన ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఉదయం మధురైకి బయలుదేరి వెళ్లారు.

మధురై సిటీ పోలీసుల సహకారంతో సూర్యా నగర్‌లోని ఆయన నివాసంలో మరిదాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ని చెన్నైకి తరలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. సైబర్ క్రైమ్ వింగ్ నమోదు చేసిన కేసు నేపథ్యంలో విచారణ కోసం యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నామని చెన్నై సిటీ పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. ఆయనపై ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామనే పూర్తి వివరాలు విచారణ తర్వాతే వెల్లడిస్తామని అన్నారు.
గతంలో కూడా రాజకీయ విశ్లేషణల పేరుతో మరిదాస్ అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయనపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పేరున్న ఆయన టీవీకే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ విమర్శలు చేస్తూ వస్తోన్నారు. వరుస వీడియోలు పోస్ట్ చేస్తోన్నారు. వీటిపై ప్రభుత్వం వివరణలు సైతం ఇచ్చింది. వాటిని విశ్వసించవద్దని కోరింది.












Click it and Unblock the Notifications