ప్రియుడితో ఎంజాయ్ చేయటానికి అడ్డుగా ఉందని ఆరేళ్ళ కూతురిని హతమార్చిన తల్లి
బెంగళూరులో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందన్న కారణంతో స్వయానా కన్నతల్లే తన ఆరేళ్ల కుమార్తెను అత్యంత కిరాతకంగా హతమార్చింది. సుమారు మూడు నెలల క్రితం జరిగిన ఈ నేరం, పోస్ట్‌మార్టం నివేదికపై తలెత్తిన అనుమానాలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటన వెనుక తల్లి అక్రమ సంబంధం
పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 15 ఏళ్ల కుమారుడు, ఆరేళ్ళ వెనిలా ఉన్నారు. ఉపాధి నిమిత్తం ఈ కుటుంబం బెంగళూరులోని కాడుగోడి ప్రాంతంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడైన మోహన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత రెండేళ్లుగా వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా ఈ బంధాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రియుడితో సంబంధానికి బిడ్డ అడ్డుగా మారిందని భావించిన తల్లి
భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ప్రవీణ్, ప్రియాంకను పలుమార్లు మందలించాడు. దీంతో ఆమె భర్త, కుమారుడిని వదిలేసి, ఆరేళ్ల కుమార్తె వెనిలాను తీసుకుని ప్రియుడు మోహన్‌తో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించింది. అయితే, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు, సంబంధానికి చిన్నారి వెనిలా అడ్డుగా మారిందని ఆ జంట భావించింది.
హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం
మూడు నెలల క్రితం ప్రియాంక తన భర్త ప్రవీణ్‌కు ఫోన్ చేసి, కుమార్తె వెనిలా హఠాత్తుగా మరణించిందని సమాచారం అందించింది. అంతేకాకుండా, ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి తీసుకున్న మరణ ధృవీకరణ, పోస్ట్‌మార్టం నివేదికను అతనికి చూపించింది. ఆ నివేదికలో బాలిక ఆహారం వికటించి ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్లు పేర్కొన్నారు.
పోస్ట్ మార్టం నివేదిక తప్పని చెప్పిన మృత బాలిక తండ్రి స్నేహితుడు
ఆసుపత్రి ఇచ్చిన నివేదికపై ప్రవీణ్‌కు కొన్ని అనుమానాలు వచ్చాయి. దీంతో అతను ఆ మెడికల్ రిపోర్టులను విదేశాల్లో వైద్యుడిగా పనిచేస్తున్న తన స్నేహితుడికి పంపించి పరిశీలించవలసిందిగా కోరాడు. ఆ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన సదరు వైద్యుడు.. అందులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గుర్తించాడు. పాప ఫుడ్ పాయిజన్‌తో చనిపోలేదని, ఆమెను గొంతునొక్కి, మరేదైనా పద్ధతిలో దారుణంగా హత్య చేసి ఉంటారని చెప్పాడు. ఆసుపత్రి యాజమాన్యం తప్పుడు నివేదిక ఇచ్చిందని తేల్చాడు.
కేసు నమోదు - నిందితుల కోసం గాలింపు
వైద్యుడి మాటలతో దిగ్భ్రాంతికి గురైన ప్రవీణ్ వెంటనే కాడుగోడి పోలీసులను ఆశ్రయించి భార్య, ఆమె ప్రియుడిపై ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల రాకను ముందే పసిగట్టిన కన్నతల్లి ప్రియాంక అక్కడి నుంచి పరారైంది. అయితే, హత్యకు సహకరించిన ఆమె ప్రియుడు మోహన్‌ను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. తప్పుడు పోస్ట్‌మార్టం నివేదిక ఇచ్చి నేరాన్ని దాచడానికి సహకరించిన సదరు ఆసుపత్రి యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితురాలు ప్రియాంక కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.













Click it and Unblock the Notifications