దావోస్ వెళ్లేందుకు ఏపీ సీఎంకు సీబీఐ కోర్టు అనుమతి: ఫ్యామిలీతో జగన్ టూర్, కీలక సదస్సుకు హాజరు
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య ఫోరమ్ సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు తాజాగా అనుమతిచ్చింది. మే 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

సీఎం జగన్ దావోస్ పర్యటనకు లైన్ క్లియర్
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటన వెళ్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. అయితే, జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దావోస్ వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. విదేశాలకు వెళ్తే కేసుల విచారణ జాప్యం జరుగుతుందని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సీఎం జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది.

ఫ్యామిలీతో సీఎం జగన్ దావోస్ టూర్
మే 19 నుంచి 31 వరకూ ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం 10 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపనున్నారు. కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. మే 22, 23, 24 తేదీల్లో దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు.

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం జగన్ బృందం
కాగా, దావోస్‌లో 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సును మే 22 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. సీఎం జగన్ నాయకత్వంలోని బృందం ఏపీలోని అవకాశాలు, ఇక్కడి ప్రజల పురోగతి అన్న ప్రధాన అంశంతో సదస్సులో పాల్గొననుంది. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సదస్సులో ఏపీ పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకూ జగన్ హాజరు కానున్నట్లు సీఎంవో వెల్లడించింది. అనంతరం మే 25 నుంచి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ సదస్సుకు సంబంధించి రాష్ట్ర లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను గురువారం ఆవిష్కరించారు.