అవినాష్ రెడ్డి మరో డిమాండ్ కూడా నెరవేర్చేసిన సీబీఐ..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణపై నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తమను విచారిస్తున్న సీబీఐ.. ఇందులో మరో కోణాన్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు సీబీఐకి ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదని కోర్టులో సైతం చెప్పారు. దీంతో సీబీఐ కూడా రూటుమార్చింది.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకూ సీబీఐ కేవలం అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే విచారణ చేస్తోందని, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె, అల్లుడు దాచేసినా పట్టించుకోవడం లేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రూటు మార్చింది. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు నిన్న హైదరాబాద్ లో ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సీబీఐ విచారణలో ప్రధానంగా వివేకా పీఏ కృష్ణారెడ్డి ఆరోజు ఘటనా స్దలిలో దొరికిన లేఖను ఎందుకు దాచేయాల్సి వచ్చిందన్న దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ లేఖపైనే అవినాష్ రెడ్డి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా ఇప్పుడు దానిపై దృష్టిసారించింది. వివేకాపై దాడి జరిగినప్పుడు ఆయన రాశారని చెబుతున్న లేఖ హత్య తర్వాత ముందుగా కృష్ణారెడ్డి చేతికే దొరికినట్లు సమాచారం. ఈ లేఖను కృష్ణారెడ్డి పోలీసులకు ఇవ్వకపోవడం, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి దాన్ని దాచి ఉంచాలని చెప్పినట్లు కృష్ణారెడ్డి ఆ తర్వాత చెప్పడం ఇప్పుడు ఈ కేసుకు కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ ఈ లేఖపై సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను ఎందుకు దాచారనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేయడం లేదని అవినాష్ పదే పదే ఆరోపిస్తున్న వేళ.. సీబీఐ ఇప్పుడు ఆ అంశంపై దృష్టిసారించింది. దీంతో అవినాష్ మరో డిమాండ్ ను సైతం సీబీఐ నెరవేర్చినట్లయింది. గతంలో సుప్రీంకోర్టులో సునీత దంపతులకు క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ.. అనంతరం వారిని సైతం విచారణకు పిలిపించింది. ఇప్పుడు వివేకా లేఖపై దృష్టిపెట్డడంతో అవినాష్ రెండు డిమాండ్లను సీబీఐ మన్నించినట్లయింది.












Click it and Unblock the Notifications