కర్నూలు ఎస్పీతో సీబీఐ చర్చలు, ఆస్పత్రిలో అవినాశ్ - ఉద్రిక్తత..!!
కర్నూలులో హై టెన్షన్ కొనసాగుతోంది. అవినాశ్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. వైద్యులతో చర్చించారు. జిల్లా ఎస్పీతోనూ మంతనాలు జరుపుతున్నారు. అవినాశ్ ను అదుపులోకి తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపైన చర్చలు చేస్తున్నట్లు సమాచారం. వరుసగా మూడు సార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా హాజరు కాకపోవటంతో సీబీఐ అధికారులు నేరుగా కర్నూలు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు అవినాశ్ మద్దతు దారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
కర్నూలులో సీబీఐ టీంలు : కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన తల్లికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలోనే ప్రస్తుతం ఉన్నారు. ఈ రోజు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. తన తల్లి అనారోగ్యం నుంచి కోలుకొనే వరకూ పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని..అప్పటి వరకు విచారణకు రాలేనని లేఖ రాసారు. ఈ సమయంలో సీబీఐ టీం కర్నూలు చేరుకుంది. నేరుగా అవినాశ్ తల్లి ఉన్న ఆస్పత్రికి చేరుకుంది. అందిస్తున్న చికిత్స పైన వైద్యుల నుంచి సమాచారం సేకరించింది. సీబీఐ అధికారులు వచ్చారనే సమాచారంతో పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ అవినాశ్ మద్దతు దారులు కర్నూలు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.

ఎస్పీతో చర్చలు..పోలీసు బలగాలు : ఇదే సమయంలో సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీతో సమావేశం అయ్యారు. అవినాశ్ ను అదుపులోకి తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చలు చేసినట్లుతెలుస్తోంది. పెద్ద సంఖ్యలో అవినాశ్ మద్దతు దారులు ఆస్పత్రి సమీపంలోకి చేరుకున్నారు. అటు అభిమానుల రాకతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సీబీఐ ఇటు పోలీసు అధికారులతో వరుసగా చర్చలు చేస్తోంది. రెండు టీంలు కర్నూలులో మొహరించాయి. అవినాశ్ ను సీబీఐ అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తుందనే వార్తలతో పులివెందుల, కడప నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆస్పత్రి సమీపంలోకి ఎవరినీ రానీయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
సీబీఐ నిర్ణయం పై ఉత్కంఠ : అటు ఢిల్లీ లోని ప్రధాన కార్యలయానికి కర్నూలులోని పరిస్థితులను అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పోలీసులు ఆస్పత్రి సమీపంలో రాకపోకలపైన ఆంక్షలు విధించారు. తన తల్లి కోరుకొనే వరకు తనకు సమయం ఇవ్వాలని మరోసారి సీబీఐ అధికారులను కోరారు. కానీ, సీబీఐ అధికారులు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి కర్నూలు చేరుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ సమయంలో అవినాశ్ తల్లి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని నోటీసులు ఇస్తారా..లేక మరేదైనా కఠిన చర్యలు తీసుకుంటారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications