YS Avinash: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరిన సీబీఐ..!
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
గతంలో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ ఇవాళ కోరింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని గత ఏడాది సీబీఐ అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాారు. అప్పట్లో ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులను ఉల్లంఘించి సాక్ష్యుల్ని ప్రభాావితం చేస్తున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇదే క్రమంలో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టుకు తన అభిప్రాయం తెలిపింది.
అవినాష్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వారు అత్యంత ప్రభావ శీలురని, వారు ఇప్పటికే దస్తగిరితో పాటు సాక్ష్యుల్ని బెదిరిస్తున్నట్లు సీబీఐ తమ అఫిడవిట్ లో తెలిపింది. ఈ నేపథ్యంలో సాక్ష్యుల్ని కాపాడాలంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. అయితే అవినాష్ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా అప్పటికే వివేకా కుమార్తె సునీత సుప్రీంలో పిటిషన్ వేయడంతో అందులో తమ అభిప్రాయం చెప్పామని పేర్కొంది..












Click it and Unblock the Notifications