జగన్ మరో తప్పును సరిచేసిన లోకేష్-ఆ విద్యార్ధులకు గుడ్ న్యూస్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్ధులకు శాపంగా మారింది. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకపోగా విద్యార్థులపై ఒత్తిడి పడుతోందని భావిస్తున్న కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ చదువుతున్న పదో తరగతి విద్యార్ధులను ఈ విద్యాసంవత్సరంలో ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించింది. ఈ మేరకు విద్యామంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం ప్రకటించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వెయ్యి ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ అనుబంధ స్కూళ్లుగా వీటికి గుర్తింపు తీసుకున్నారు. అయితే ఆయా స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ బోధన కోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, సదుపాయాలు కల్పించడం వంటి సన్నాహాలు మాత్రం చేయలేదు. దీంతో ఈ కొత్త సిలబస్ లో అభ్యసించేందుకు విద్యార్ధులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం రాష్ట్ర సిలబస్ లో చదువుకుంటున్న విద్యార్ధులు కఠినమైన సీబీఎస్ఈ సిలబస్ కు అలవాటుపడటం ఇబ్బందికరంగా మారింది.

దీంతో ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో ఇలా ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ చదువుతున్న విద్యార్ధుల్లో 64 శాతం మందికి పైగా ఫెయిల్ అయ్యారు. అలాగే 326 స్కూళ్లలో అయితే ఒక్కరు కూడా పాస్ కాలేదు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఈ ఏడాదికి సీబీఎస్ఈ చదువుతున్న విద్యార్ధులకు రాష్ట్ర సిలబస్ ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు అనుమతించింది. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ లో జరిగే ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలు రాసేందుకు వారు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications