విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం దూకుడు.. టెండర్ల ఆహ్వానం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. ఇక కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఏపీని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు హామీకి కీలక అడుగు పడింది.
మొదలైన రైల్వే జోనల్ కార్యాలయ టెండర్ ప్రక్రియ
రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటివరకు రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. అయితే తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇది విశాఖపట్నం సంతోషానికి కారణంగా మారింది. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్ ప్రక్రియను ప్రారంభించింది.

త్వరలో ప్రధాని మోడీ పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 29న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ 2 కు ఆయన శంకుస్థాపన చేయనున్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం తొమ్మిది అంతస్తులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి 11 అంతస్తుల భవన నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించింది.
భూసేకరణ చేసి అ రైల్వేకు అప్పగించిన చంద్రబాబు సర్కార్
ఆగస్టు నెలలో చినగదిలి మండలం ముడుసర్లోభ గ్రామంలోని సర్వే నెంబర్లు 57, 58, 59/1, 61/1, 62, 63, 64, 65లో దాదాపు 53 ఎకరాల భూమిని సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించగా జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు.
149.16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం
మొత్తం 149.16కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్ 27వ తేదీలోపు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేయాలని రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు టెండర్లు దక్కించుకున్న సంస్థ రెండు సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేయాలని కూడా పేర్కొంది. ప్రధాని మోడీ నవంబర్ 29న విశాఖకు వేదికగా రైల్వే జోన్ టూ కు శంకుస్థాపన చేయడంతో పనులను పరుగులు పెట్టించాలని రైల్వే శాఖ భావిస్తుంది.
రైల్వే జోన్ కార్యాకలాపాలపై స్థానికుల డిమాండ్
ఇక విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసిన నేపథ్యంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణాలతో సంబంధం లేకుండా తొలుత జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే బాగుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొంత భవన నిర్మాణానికి రెండు నుంచి మూడు ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకు విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ఆపడం తగదని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications