రామచంద్రయాదవ్ కు Y+ సెక్యూరిటీ కల్పించిన అమిత్ షా!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం సంభవించింది. పుంగనూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరి భద్రత కల్పించింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన రామచంద్రయాదవ్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

రామచంద్ర నివాసంపై దాడి
ఇటీవలే పుంగనూరులో రామచంద్రయాదవ్ నివాసంపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసంతోపాటు ఇంటిబయట నిలిచిన కార్లను కూడా అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. దీంతో ఈనెల 11వ తేదీన కేంద్ర హోంశాఖ అమిత్ షాను కలిశారు. 40 నిముషాలు భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న దాడుల గురించి హోంమంత్రికి వివరించానని, ఆయన చర్యలు తీసుకుంటాన్నారని రామచంద్రయాదవ్ ప్రకటించారు. మంత్రిని కలిసిన 10 రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరి భద్రత కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర సాయుధ బలగాలు రేపు పుంగనూరుకు చేరుకోనున్నాయి.

24 గంటలపాటు భద్రత
ఈ సందర్భంగా తనకు భద్రత కల్పించిన అమిత్ షాకు రామచంద్ర కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు Y+ భద్రత కల్పిస్తారు. కేంద్ర సాయుధ పోలీసులు, కమాండోలతో ఇంటి వద్ద స్కానింగ్ సెక్యూరిటీ ఉంటుంది. దేశంలో ఎక్కడ పర్యటించినా రామచంద్ర యాదవ్‌కు 24 గంటలు భద్రత కల్పిస్తారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రామచంద్రకు పొసగడంలేదు. తనపై పెద్దిరెడ్డి మనుషులే హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు.

గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ
పుంగనూరులో కొద్దిరోజుల క్రితం రామచంద్రయాదవ్ రైతులకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై రైతుభేరి సదస్సు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీనికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. అదేరోజు రామచంద్ర అనుచరులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆరోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు 300 మంది దాడికి పాల్పడ్డారని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసి ఓటమి పాలైన తర్వాత స్వతంత్రంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా హైటెన్షన్ వాతావరణం క్రియేటవుతోంది.












Click it and Unblock the Notifications