చంద్రబాబుకు మరోవరం ప్రకటించిన నరేంద్రమోడీ
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా రహదారుల విస్తరణకు, కొత్త రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అనుసంధానం పెరిగితే అభివృద్ధి సహజంగానే జరుగుతుందనేది మోడీ ఆలోచన. అందుకనుగుణంగా నితిన్ గడ్కరీకే ఈసారి కూడా రహదారుల శాఖను కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ - 2047లో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కొత్తగా హైస్పీడ్ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు.
హైస్పీడ్, గ్రీన్ ఫీల్డ్ కారిడార్ గా
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య నాలుగు వరుసల రహదారి ఉంది. దీన్ని ఆరు వరుసలకు అభివృద్ది చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై సర్వే నిర్వహించగా హైస్పీడ్ కు తగినట్లుగా దాన్ని విస్తరించడం సాధ్యం కాదని తేలింది. దీంతో 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్, గ్రీన్ ఫీల్డ్ కారిడార్ ను రూపొందించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ నిర్ణయం తీసుకొని తన మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 556 కిలోమీటర్ల మేర రహదారి అందుబాటులో ఉంది. ఏపీలో 260 కిలోమీటర్లు, తెలంగాణలో 190 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ మధ్య రాకపోకలు పెంచాలని
హైదరాబాద్-నాగ్‌పూర్-బెంగళూరు మధ్య రాకపోకలు మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రిందటే నిర్ణయించింది. బెంగళూరు నుంచి నాగ్ పూర్ వరకు నిర్మించబోతున్న జాతీయ రహదారికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య కూడా హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు రాకపోకలు పెరుగుతాయనేది కేంద్రం ఆలోచన. కొత్తగా నిర్మించబోయే హైస్పీడ్ కారిడార్ ను ఆరు వరుసలుగా నిర్మిస్తారు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య కొత్తగా నిర్మించబోయే రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీలుంది. ఈ హైస్పీడ్ కారిడార్ ను తొలుత నాలుగు వరుసలుగా నిర్మించి తర్వాత ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తారా? లేదంటే నిర్మించడమే ఆరు వరుసలగా నిర్మిస్తారా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications