జగన్ సర్కార్‌కు కేంద్రం మొండిచెయ్యి- ఆ 16 రాష్ట్రాలకు రూ.56 వేల కోట్లు
అమరావతి/ న్యూఢిల్లీ: రాష్ట్రాలకు సంబంధించిన మూలధన పెట్టుబడి ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 రాష్ట్రాలకు 56,415 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి మొత్తాన్ని మంజూరు చేసింది. మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2023-24 పథకం కింద దీన్ని ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం నీటిపారుదల, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, కాజ్‌వే, వంతెనల నిర్వహణతో పాటు రైల్వేలకు సంబంధించిన కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్టులను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్రాల వాటాను తీర్చడానికి కూడా ఈ నిధులను బదలాయించింది. ఆయా రంగాలలో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి ఈ నిధులను ఉపయోగించాల్సి ఉంటుంది.

రాష్ట్రాల మూలధన వ్యయాలను ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఈ మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2023-24 పథకాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని కింద రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణం రూపంలో మొత్తం ఈ ఆర్థిక సంవత్సరానికి 1.3 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటుంది. 15 వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారం కేంద్ర పన్నులు, సుంకాల వాటాకు అనుగుణంగా ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు కేటాయించింది.
అరుణాచల్ ప్రదేశ్- రూ.1,255 కోట్లు, బిహార్- రూ.9,640 కోట్లు, ఛత్తీస్‌గఢ్- రూ. 3,195 కోట్లు, గోవా- రూ.386 కోట్లు, గుజరాత్- రూ. 3,478 కోట్లు, హర్యానా- రూ.1,093 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ.826 కోట్లు, కర్ణాటక- రూ.3,647 కోట్లు, మధ్యప్రదేశ్- 7,850 కోట్లు, మిజోరం- రూ.399 కోట్లు, ఒడిశా- రూ. 4,528 కోట్లు, రాజస్థాన్- 6,026 కోట్లు, సిక్కిం- రూ.388 కోట్లు, తమిళనాడు- 4,079 కోట్లు, తెలంగాణ- రూ.2,120 కోట్లు, పశ్చిమ బెంగాల్- రూ. 7,523 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు. ఏపీ సహా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ పేర్లు లేవు. మూల ధన వ్యయాల కింద 15వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారమే ఈ నిధులను మంజూరు చేయడం వల్ల ఆ జాబితాలో ఆయా రాష్ట్రాలు లేకపోవడం వల్లేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications